ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి. ఆయన స్వస్థలం ములుగు జిల్లా.
కాల్వపల్లి దామోదర్ మరణించినట్లు మావోల ప్రకటన ధ్రువీకరించని పోలీసు వర్గాలు
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ – – మారేడుబాక అటవీప్రాంతంలో రెండు రోజుల కిందట జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలకనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఉన్నట్లు శనివారం ఆపార్టీ ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరిట విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కరావు మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్‌లో చేరారు. క్రమంగా ఆపార్టీలో ఎదుగుతూ ఆరు నెలల క్రితమే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ కరోనా కాలంలో మృతిచెందడంతో ఆయన స్థానంలో బడే చొక్కారావుకు తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించింది. ఇలా ఉండగా, బడే చొక్కారావు భార్య రజితను 2023లో పోలీసులు అరెస్టు చేశారు.
పూజారి కాంకేర్ – – మారేడుబాక అటవీప్రాంతం రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మరణించిన విషయాన్ని కూడా పార్టీ విడుదల చేసిన లేఖలో వెల్లడించింది. మీడియాలో వచ్చినట్లు ఆ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య 12 మంది కాదు 18 మందిగా పార్టీ నిర్దారించింది. మృతుల్లో బడే చొక్కారావుతో పాటు మరో తెలుగు నేత నర్సింహారావు రావు కూడా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా లేఖలో పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకు పైగా పీపుల్స్‌వార్ పార్టీ అనంతరం మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పేరుగాంచారు. దామోదర్‌పై ఛత్తీస్‌గఢ్‌లో రూ.50 లక్షల రివార్డు ఉండగా, తెలంగాణలోనూ రూ.25లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఆయన ఇన్‌చార్జిగా కూడా వ్యవహరించారు.
కూంబింగ్‌తో దొరికిన మావోలు
బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. దీంతో ఆ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిభిరం ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నక్సల్స్ కోసం కూంబింగ్ నిర్వహించారు. ఆ సందర్భంగా మావోయిస్టులు, పోలీసు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతిచెందగా, వారిలో దామోదర్ ఉన్నట్లు మావోయిస్టుపార్టీ పేర్కొంది.
దామోదర్ తల్లిని కలిసిన ఎస్పీ శబరీష్
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు స్వగ్రామం కాల్వపల్లికి ఇటీవల ములుగు ఎస్పీ శబరీష్ స్వయంగా వెళ్లి దామోదర్ మాతృమూర్తి బతుకమ్మను కలుసుకున్నారు. అడవిబాట పట్టిన నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘పోరుకన్నా ఊరు మిన్న’, ‘మన ఊరికి తిరిగి రండి..’ అంటూ నక్సలైట్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దామోదర్ తల్లి బతుకమ్మను ఎస్పీ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న బతుకమ్మకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, ఈ సందర్భంగా ఆమె తన కొడుకును చూడాలని ఉందని, ఇంటికి తిరిగి రావాల్సిందిగా ఆమెతో పోలీసులు పిలుపు ఇప్పించారు.
సోదరుడు సైతం ఉద్యమబాటే&
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సోదరుడు బడే నాగేశ్వరరావు కూడా ఉద్యమబాటలోనే కొనసాగి అశువులుబాశారు. ఆయన వరంగల్ జిల్లా పీపుల్స్ వార్ గ్రూప్ జిల్లా కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న సమయంలోనే లక్నవరం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
వనరులదోపిడికే యుద్దం
బస్తర్ జిల్లాలోని సహజవనరులను దోపిడిచేసేందుకు స్థానిక గిరిజనులపై రాజ్యం యుద్దం చేస్తుందని మావోయిస్టుపార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగానది ఆరోపించింది. దేశంలోనే ఈ ప్రాంతాన్ని అత్యంత సైనికీకరణ ప్రాంతంగా మారిందని ఆపార్టీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ‘నక్సల్స్ నిర్మూలన’ నినాదంతో గిరిజన సంఘాలను ప్రభుత్వం లక్షంగా ఎంచుకుని ఏరివేత కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై రాజ్యం నిర్వహిస్తున్న అమానవీయ దురాగతాలను బహిర్గం చేయాలని అభ్యుదయ మేధావులు, పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రజాసంఘాలకు విజ్ఞప్తి చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నిలబడాల్సిన సమయం ఇది అని ఆ లేఖలో వెల్లడించారు.