Sunday, December 29, 2024

విప్లవోద్యమ కెరటం

- Advertisement -
- Advertisement -

ఆయన దండకారణ్యంలో విప్లవ బాటలు వేసిండు, ఆయన భారత పాలక వర్గాలకు దీటుగా జనతన సర్కార్ వంటి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పరిచ్చిండు, గని కార్మిక వర్గానికి పోరాట దారులు నిర్మించిండు, ఇంద్రవెల్లి వంటి చరిత్రాత్మక పోరాటానికి అన్ని తానై నడిపించి గిరిజన హక్కులను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాడు. రాష్ట్రాలను దాటి దేశంలో విప్లవ పోరాట మార్గాలను వేసిండు, దేశంలో ఎర్ర సైన్యానికి గెరిల్లా యుద్ధ తంత్రాలను నేర్పిండు. బలమైన విప్లవ పోరాటాలను, శక్తులను కాంక్రీటుగా పటిష్టం చేసిండు. దేశంలో విప్లవ నిర్మాతల్లో ఒకరు. భారత విప్లవ కెరటంగా కటకం సుదర్శన్‌ నిలిచిండు. సుదర్శన్ ఆకస్మిక మరణం దేశంలో విప్లవ పోరాటాలకు, విప్లవోద్యమాలకు తీరని లోటు.
సుదర్శన్ మరణ వార్త తెలంగాణతో పాటు నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాలు ఉలికి పాటుకు గురయ్యాయి. ఆయన ఐదు దశబ్దాల పాటు పూర్తిగా విప్లవ నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేసి పని చేశాడు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యుడు. సెంట్రల్ రీజినల్ బ్యూరో కార్యదర్శి, సుదర్శన్ మే 31న అనారోగ్యంతో మరణించినట్లు ఆ పార్టీ ప్రకటించడంతో పీపుల్స్ వార్‌లో పాతతరం జాడలు ముగిసినట్లయింది.

సుదర్శన్ తొలి తరం నాయకుల్లో ఒకరు. కరీంనగర్ జిల్లా నుండి ముప్పాల్ల లక్ష్మణ్ రావు, నల్లా ఆదిరెడ్డి మల్లొజల కోటేశ్వర్ రావు, వేణుగోపాల్లాగే ఆదిలాబాద్ జిల్లా నుండి కటకం సుదర్శన్, గజ్జల గంగారాంలు, కొండపల్లి సీతారామయ్యతో కలిసి పీపుల్స్ వార్ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు.సింగరేణి కార్మికుడు కటకం మల్లయ్య కుమారుడైన సుదర్శన్ 1974 -75లలో పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతూనే విప్లవ పార్టీ నిర్మాణం కోసం పని చేయడం ప్రారంభించాడు. శ్రీకాకుళం ఉద్యమం ముగిసినంక, 1977 ఎమర్జెన్సీ తర్వాత తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో మొదలైన విప్లవ పోరాటాలకు అంకురార్పణ చేసిన వారిలో సుదర్శన్ ముఖ్యుడు. నల్లా ఆదిరెడ్డి తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు తొలి వార్ జిల్లా కార్యదర్శిగా సుదర్శన్ నియమించబడ్డాడు.

బెల్లంపల్లిలో 1978 జరిగిన గుండా జంట హత్యల తర్వాత సుదర్శన్ అజ్ఞాతంలోకి వెళ్లి 2023 మే 31న మరణించే వరకు ఆయన అజ్ఞాత జీవితమే గడిపిండు. తొలుత జన్నారం ప్రాంత ఆర్గనైజర్‌గా చేసిండు. 1980లో ఏర్పడిన పిడబ్లుజి గ్రూప్‌కి జిల్లా కార్యదర్శిగా మొదలుకొని కేంద్ర కమిటీలో ముఖ్య నాయకునిగా, వ్యూహకర్తగా, గెరిల్లా యుద్ధ తంత్రంలో దీటుగా ఎదిగి దేశంలో మోస్ట్ పాపులర్ నక్సలైట్ నాయకునిగా ఆనంద్ అనేక సంచలనా లను సృష్టించిండు. 1981లో దేశంలోనే అతిపెద్ద గిరిజన పోరాటమైన ఇంద్రవెల్లి పోరాటాన్ని సుదర్శన్ ప్రత్యక్షంగా పాల్గొని నడిపించిండు. గిరిజన రైతు కూలీ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆదివాసుల హక్కుల కోసం గిరిజనులను కదిలించి, పోరాటాలను నిర్మించిండు. అయన అనుసరించే వ్యూహాలు, ఎత్తుగడలు ప్రభుత్వలను ముప్పుతిప్పలు పెట్టాయి. తన 48 ఏళ్ల అజ్ఞాత జీవితంలో ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కకపోవడం ఆయన నిబద్ధ్దత, సాంకేతిక విధానం, అంకిత భావం, రాజకీయ ఎత్తుగడల, పద్ధతుల పాటించే విధానంలో ఆయనదిట్ట.
1980లో సిరివోంచ వద్ద జరిగిన తొలి ఎన్‌కౌంటర్ లో పెద్ది శంకర్ మరణించగా నాయకుడైన సుదర్శన్ తప్పించుకున్నాడు. 1987లో హైదరాబాద్ రాంనగర్‌లో వార్ అగ్ర నేతలు ఆదిరెడ్డి సహా పలువురు అరెస్టు కాగా, ఆ సంఘటన నుండి సుదర్శన్ చాకచక్యంగా తప్పించుకున్నట్లు ప్రచారం అయ్యిం ది.

1995లో సిర్పూర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలో ఆనంద్ చనిపోయినట్లు పోలీస్‌లు ప్రకటించారు. దీనితో కుటుంబ సభ్యులు ఇంట్లో కర్మ కాండలు కూడాచేశారు. కానీ తర్వాత కొద్ది రోజుల కు తాను బతికే ఉన్నట్లు ప్రకటించి సుదర్శన్ సంచలనం సృష్టించాడు. సుదర్శన్ భార్య లలితక్క ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలోనే 1997లో సిర్పూర్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించింది. 48 సంవత్సరాల సుదీర్ఘ అజ్ఞాత జీవితంలో అనేక దశలలో పని చేసిండు. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా, ఆల్ ఇండియా స్పెషల్ సెషన్ కమిటీ కేంద్ర కమిటీ సభ్యునిగా, సెంట్రల్ రీజినల్ బ్యూరో కార్యదర్శిగా పని చేయడం కాకుండా దేశంలోని ఎంసిసిఐ, పార్టీ యూనిట్ వంటి విప్లవ సంస్థలను ఒక్కటిగా చేసి పీపుల్స్ వార్‌లో విలీనం చేసి మావోయిస్టు పార్టీగా ఏర్పాటు చేయడంలో ఆయన ముఖ్య మైన పాత్ర పోషించినట్లు ఆ పార్టీనే ప్రకటించడం విశేషం. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జనతన సర్కార్ పేరిట ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడపడంలో ప్రధాన భూమికను ఆనంద్ పోషించాడు. ఆదిలాబాద్ జిల్లాలో జరిపిన కరువు దాడులు గిరిజన పోరాటాల, రహస్య కార్యకలాపాల నేపథ్యంలో పులి ఆనంద మోహన్ పేరిట రాసిన ‘వసంత గీతం’ నవల ఎంతో పాపులర్ అయింది. వార్ తరం ముగిసింది.

తొలి విప్లవ కారులంతా ఒక్కొక్కరు నేల కొరుగుతూ వస్తుండగా మిగిలిన ఒకేఒక్క విప్లవ దిగ్గజం కటకం సుదర్శన్ సుదీర్ఘ అజ్ఞాత వాసంలో ఎన్నో సంఘటన లు ఎదుర్కొని చివరికి ఇలా అనారోగ్యంతో, ఆకస్మికంగా నేల కొరగడంతో కోల్‌బెల్ట్ ప్రాంతం అంతా ఆనంద్ అభిమానులు, సానుభూతిపరులు దిగ్భ్రాంతి చెందారు. బెంగాల్‌లో మల్లొజల కోటేశ్వర్‌రావు వంటి దిగ్గజం నేలకొరిగాడు. అప్పటి తరానికి చెందిన చాలా మంది లొంగిపోయి బయటికి వచ్చి సాధారణ జీవితం గడుపుతుండగా, అనేక మంది నాయకులు ఎన్‌కౌంటర్లలో అసువులు బాశారు. కటకం సుదర్శన్ తన సుదీర్ఘ అజ్ఞాత జీవితంలో ఎన్నడూ పోలీసుల చేతికి చిక్కకుండా, తాను ఎంచుకున్న మార్గంలో నమ్మిన సిద్ధాంతం కోసం, పేద ప్రజల కోసం, విప్లవ సంస్థ నిర్మాణం కోసం చివరి దాకా నిలబడి తెలుగు రాష్ట్రం నుండి వెళ్లి మధ్య భారతం లోని పలు రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా విప్లవ పార్టీని విస్తరించిన పార్టీ అగ్రగణ్యుడు సుదర్శన్. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీని నిర్మించి, బలోపేతం చేసిన ఆనంద్ తన ఆశయ సాధనతో తుది శ్వాస విడిచే వరకు పార్టీని, ప్రజలను వీడని గొప్ప నిబద్ధత కలిగిన విప్లవ నాయకుడుగా చరిత్ర సృష్టించాడు.

ఆయన బొగ్గు గని కార్మికులను మొదలు అనేక తెగల గిరిజన, ఆదివాసుల కోసం పని చేశాడు, పరితపించాడు. ఆయన దోపిడీ లేని సమాజం కోసం నిరంతరం పోరాడాడు. సుదర్శన్ ( ఆనంద్ ) అమరత్వం హిమాలయాల కన్నా ఉన్నతమైనది. బెల్లంపల్లిలో మొదలయి, గని కార్మికుల నుండి ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, జిల్లాతో పాటు, ఉత్తర తెలంగాణ, దండకారణ్యం దిశగా చత్తీస్‌గఢ్‌తో పాటు మధ్య భారతంలోని పలు రాష్ట్రాలలో విప్లవోద్యమాలను నిర్మించి, పార్టీ క్యాడర్‌ను, తయారు చేసి ఐదు దశాబ్దాల పాటు, సర్కార్‌కు కొరకరాని కొయ్యగా, పట్టుబడని నేతగా ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టాడు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా సుదర్శన్ తలపై ప్రకటించింది. ఆయన జీవిత కాలంమంతా కార్మికులు, గిరిజనులు, దళితులు, బలహీనవర్గాల విముక్తి కోసం పోరాడిన నిబద్ధత గల విప్లవ మేధావి కటకం సుదర్శన్.

ఏబూసి
9849157969

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News