హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణలోని పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలను నిర్వహించారు. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఆర్కే అంత్యక్రియలను పూర్తి చేశారు. ఆర్కే అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు.
కాగా, ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ధ్రువీకరించింది. కిడ్నీలు విఫలమై ఆర్కే మృతి చెందినట్టు మావోయిస్ట్ అగ్రనేతలు వెల్లడించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశామని వారు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కేకు చికిత్స అందించినప్పటికీ, తనను రక్షించుకోలేకపోయామని మావోయిస్ట్ అగ్రనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆర్కే మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ కూడా తెలిపారు. డయాలసిస్ కొనసాగుతుండగా కిడ్నీలు విఫలమై ఆర్కే చనిపోయాడని ఆయన వెల్లడించారు.
Maoist Party released RK last rites photos