Sunday, November 3, 2024

మావోయిస్టు నేత రంజిత్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ఆశయాలకు అవమానం
డిజిపి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు నేత రంజిత్
రూ. 4లక్షల అర్థిక సాయం అందజేసిన డిజిపి
కీలక ఘటనలలో పాల్గొన్న రంజిత్
తల్లిదండ్రులతో పాటు పార్టీకి సేవ
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ అలియాశ్ శ్రీకాంత్ బుధవారం నాడు నగరంలోని డిజిపి కార్యాలయంలో డిజిపి మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయాడు. మావోయిస్టు రంజిత్ లొంగుబాటు సందర్భంగా ఏర్పాటు మీడియా సమావేశంలో డిజిపి మాట్లాడుతూ రంజిత్ మావోయిస్టు పార్టీలో అవమానాలు, వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కోలేక లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రంజిత్‌కు ఆర్థికసాయంగా ప్రభుత్వం తరపున రూ.4 లక్షల చెక్ ఇవ్వనున్నట్లు డిజిపి తెలిపారు. ఉన్నతస్థాయి కేడర్ నేతల కుమారునిగా రంజిత్ చిన్నప్పటి నుంచి మావోయిస్టు కార్యకలపాల్లో పనిచేస్తూ మరోవైపు సమాజంలో వచ్చిన మార్పులను గమనించాడని, మారుతున్న సమాజానికి మావోయిస్టు కార్యకలాపాలతో పెద్దగా ఉపయోగం లేదని భావించి లొంగుబాట పట్టాడన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం దిశగానే ఉండటం వల్ల ప్రజాస్వామ్యం విధానాలపై కొత్తగా మావోయిస్టులు చేయాల్సిన పని ఏమీ లేదన్న అభిప్రాయానికి రంజిత్ వచ్చినట్లు డిజిపి వెల్లడించారు. కరోనా సోకిన మావోయిస్టులు లొంగిపోతే వాళ్లకు ప్రభుత్వం మంచి వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉందని, లొంగిపోయిన మావోయిస్టులకు వెంటనే పునరావాసం కల్పిస్తామని డిజిపి వివరించారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో 25మంది ఉండగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే 14మంది ఉన్నారని, వాళ్లు లొంగిపోతే తగిన పునరావాసం కల్పిస్తామని డిజిపి తెలిపారు.
రామన్న కొడుకు రంజిత్…
వరంగల్ జిల్లా మద్దూర్ మండలం బెక్కల్‌కు చెందిన మవోయిస్ట్ రావుల శ్రీనివాస్ అలియాన్ రామన్న కుమారుడే రంజిత్. 1982 సమయంలో జరిగిన పీపుల్స్ వార్‌లోనే రామన్న పాల్గొన్నాడు. అప్పటి నుంచి భద్రాచలం దళంలో ఉంటూ సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, డికెఎస్‌జెడ్‌సి సెక్రటరీగా ఎదిగాడు.కాగా పార్టీలో మాధవి అలియాస్ సామిత్రి అలియాస్ సుశీలకు 1988లో రంజిత్ జన్మించాడు. రంజిత్ బాల్యమంతా మవోయిస్టుల కార్యక్రమాల్లో భాగస్వామ్యుడయ్యాడు. ఆరో తరగతి వరకు జన్‌ధన్ సర్కారు పాఠశాలలో చదువు సాగించాడు. ఆ తర్వాత సీక్రెట్‌గా నగేశ్ అనే మావోయిస్టు సాయంతో నిజామాబాద్‌లోని కాకతీయ పాఠశాలలో పది వరకు చదివాడు. 2015లో పదో తరగతి పూర్తయ్యాక మవోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు.
బాల్యం నుంచే ఉద్యమ బాట:
వరంగల్ జిల్లాకు చెందిన రామన్న, సావిత్రిల కుమారుడు రంజిత్ ఆరవ తరగతి నుంచే మావోలతో తిరిగేవాడని, బాల్యం అంతా మావోయిస్టు దళాల మధ్యే గడిచింది. రంజిత్ తండ్రి సెంట్రల్ కమిటీ సెక్రెటరీ రామన్న 1982లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. ఈక్రమంలో రామన్న గుండెనొప్పితో 2019లో మృతి చెందారు. రంజిత్‌ను నగేష్ అనే వ్యక్తి సీక్రెట్‌గా చదివించడంతో టెన్త్ పూర్తి చేసుకున్నాడు. రంజిత్‌ను చదివించిన నగేష్ 2015లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి మృతి తర్వాత రంజిత్ పార్టీలో ఇబ్బందులు పడ్డాడు. చివరికి లొంగిపోవాలని నిశ్చయించుకొని డిజిపి ఎదుట సరెండర్ అయ్యారు.
పార్టీ వ్యతిరేకించినా:
దండకారణ్యంలో జరిగిన నాలుగు కీలక దాడుల్లో రంజిత్ పాల్గొన్నాడని, 2018లో 9 మందిని హతమార్చిన కాసారం దాడిలో పాల్గొన్నాడని డిజిపి తెలిపారు. 2020లో జరిగిన ఎర్రం దాడి, 2020లో 23 మంది పోలీసులను హతమార్చిన మినప దాడిలోనూ రంజిత్ ఉన్నాడన్నారు. 2021లో 26 మంది పోలీసులు చనిపోయిన జీరం దాడిలోనూ రంజిత్ పాల్గొన్నాడన్నారు. మావోయిస్టు రంజిత్ లొంగుబాటు పార్టీ సభ్యులకు, పార్టీ పెద్దలకు ఇష్టం లేనప్పటికీ అతను లొంగిపోయాడన్నారు. రంజిత్ 2020 నుంచి 21 మధ్యకాలంలో జరిగిన వరుస దాడుల్లో పాల్గొన్నాడని, ఆ దాడుల్లో 49 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ ఘటనలలో ముగ్గురు మావోలు కూడా మృతి చెందారని, చనిపోయిన పోలీసుల నుంచి 12 ఎకె-47తో పాటు, 14 ఫైర్ ఆర్ముడ్ ఆయుధాలను పార్టీ స్వాధీనం చేసుకుందని తెలిపారు.
అవమానాలు భరించలేక:
మావోయిస్టు పార్టీలో 2019లో తండ్రి రామన్న మరణించాక అనేక అవమానాలకు గురైన రంజిత్ మావోయిస్టు కార్యక్రమాలపై విరక్తి చెందాడని డిజిపి తెలిపారు. తండ్రి రామన్న మృతి తరువాత రంజిత్ పార్టీలో వేధింపులకు మొదలుకావడంతో పాటు పార్టీలోని సభ్యులు బతికి ఉన్నప్పుడు ఒకలాచనిపోయిన తర్వాత మరొకలా రంజిత్‌తో ఉన్నట్టు మా దృష్టికి వచ్చిందని డిజిపి తెలిపారు. 2015 నుంచి 2017 వరకు తండ్రి ఆధ్వర్యంలోనే రంజిత్ పలు కీలక కార్యక్రమాలలో పాల్గొన్నాడన్నారు. 2017లో రామన్న సలహా మేరకు రంజిత్ బెటాలియన్‌లో చేరాడని, సెంకండ్ ప్లాటూన్ మెంబర్‌గా చేరి 2019 వరకు పదోన్నతి మీద ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్‌గా ఎదిగాడన్నారు. 2019లో రామన్నకు రెండు సార్లు గుండెపోటు వచ్చిన సమయంలో మెరుగైన చికిత్స కోసం బయటికి వెళ్దామని రంజిత్ చెప్పినప్పుడు రామన్న ఒప్పుకోలేదన్నారు. సరైన వైద్యం అందక పరిస్థితి విషమించి రామన్న చనిపోయినప్పటి నుంచి రంజిత్‌కు దళంలో అనేక అవమానాలు ఎదురయ్యాయన్నారు. అప్పటి నుంచి రంజిత్‌కు మావోయిస్టు కార్యకలాపాలపై విరక్తి వచ్చింది. తాను బయటికి వెళ్తానని కమిటీ సభ్యులను అనుమతి కోరగా నిరాకరించారన్నారు. అప్పటి నుంచి జూన్ వరకు తన తల్లి సుశీల ఆధ్వర్యంలోనే పనిచేశాడన్నారు.
ప్రస్తుతం పార్టీ చీఫ్ ఎవరూ లేరు:
మావోయిస్టు పార్టీలో హరి భూషణ్ మృతి తర్వాత ఇంకెవరూ పార్టీ చీఫ్‌గా భాద్యతలు తీసుకోలేదని, ఇంచార్జిగా దామోదర్ అనే వ్యక్తి ఉన్నట్టు మా దృష్టికి వచ్చిందని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్స్‌గా తెలంగాణ నుంచి 14 మంది ఉన్నారని, సెక్రెటరీ యపనారాయణ కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు రంజిత్ వివరించాడన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని లొంగిపోవాలని కోరుతున్నామని డిజిపి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News