ఆయన భార్య షీలా మరాండీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాంచీ : అగ్రస్థాయి మావోయిస్టు నేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్‌దాను చత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. పలు కీలక కేసులతో సంబంధం ఉన్న ఈ నక్సల్ నేతను పట్టిస్తే రూ కోటి నజరానా అని గతంలో పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు ప్రశాంత్ బోస్‌ను భార్య షీలా మరండి సహా అదుపులోకి తీసుకున్నట్లు, మరండీ మావోయిస్టు సభ్యురాలు అని పోలీసు అధికారి తెలిపారు. ఇప్పుడు అరెస్టు అయిన నక్సల్ నేతపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సీనియర్ నేతగా చలామణిలో ఉన్నారని వివరించారు. అంతేకాకుండా ఆయన సిపిఐ (మావోయిస్టు) తూర్పు ప్రాంత బ్యూరో కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఈ మావోయిస్టు నేత తలకు కోటి రూపాయల వెల కట్టారు. తమకు అందిన ఫక్కా సమాచారం ఆధారంగా నిఘా చర్యలను ముమ్మరం చేసి, వీరిని అదుపులోకి తీసుకున్నారు. బోస్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాలలో నక్సల్స్ కార్యకలాపాల కీలక నిర్వాహకులుగా ఉన్నారు. తన కార్యకలాపాలను పకడ్బందీ దళంతో సరందా అడవులలో ఉంటూ నిర్వహిస్తున్నారని , నక్సల్స్‌కు ఆయువుపట్టుగా మారారని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.