Monday, December 23, 2024

హిడ్మా ఇలాకాలో.. తప్పిన లెక్క!

- Advertisement -
- Advertisement -

మావోయిస్టు నేత మోస్ట్ వాంటెడ్ మడివి హిడ్మా మరోమారు భారీ కుట్రకు స్కెచ్ వేసినట్లు పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వారం రోజులుగా సుక్మా జిల్లా జేగురుకొండ కేంద్రంగా మకాం వేసి రెక్కీ నిర్వహించాడు. తెర్రం తరహాలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను తన ఉచ్చులోకి లాగి మట్టుబెట్టేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. దండకారణ్యంలోని భూ భౌగోళిక పరిస్థితులు తెలిసిన డిఆర్‌జి పోలీసు బలగాలు హిడ్మా కుట్రను స్వల్ప నష్టంతో చాకచక్యంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు సైతం పెద్ద సంఖ్యలో గాయపడి ఉంటారని పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గురి తప్పిన హిడ్మా లెక్కాపై ‘మన తెలంగాణ’ అందిస్తున్న పరిశోధన కథనం.

చర్ల : నాలుగు రోజుల క్రితం సుక్మా జిల్లా జేగురుకొండ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసు బలగాలకు భారీ ప్రాణనష్టం తప్పినట్లైంది. మావోయిస్టు నేత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మి (పిఎల్‌జిఏ) కమాండర్ మడివి హిడ్మా ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కుందేడు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో డిఆర్‌జి జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదుకాల్పుల్లో ముగ్గురు డిఆర్‌జి జవాన్లు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో డిఆర్‌జి జవాన్ల కంటే మావోయిస్టుల సంఖ్య మూడింతలు ఎక్కువగా ఉంటుందని సుక్మా జిల్లా ఎస్‌పి సునీల్‌శర్మ తెలిపారు. మావోయిస్టులు 250 బిజిఎల్‌ను ఉపయోగించినట్లు తెలిపారు.

జేగురుకొండ అటవీ ప్రాంతంపై పట్టున్న డిఆర్‌జి జవాన్లు నక్సల్స్ వ్యూహాన్ని ముందే పసిగట్టటంతో భారీ ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకున్న భద్రతా బలగాలు బ్యాకప్ టీమ్ సహాయం తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఇదే అదునుగా భావించిన నక్సల్స్ ఆకస్మిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఆఖరి క్షణంలో 800 వందల మీటర్ల ముందు నక్సలైట్లు సైనికులను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారని, ఈ లోగా భారీ ఎత్తున బలగాలు రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారని తెలిపారు. ఎదురుకాల్పుల్లో చాలా మంది నక్సలైట్లకు గాయాలు తగిలినట్లు కూబింగ్‌లో పాల్గొన్న జవాన్లు తెలిపినట్లు ఎస్‌పి వెల్లడించారు.

ఈ ఎదురుకాల్పుల్లో జవాన్ల కంటే మావోయిస్టులే అధిక సంఖ్యలో గాయపడ్డారని, గాయపడిన వారికి ఉర్సంగల్, బడే కద్వాల్ ప్రాంతాల్లో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం వస్తోందని తెలిపారు. ఎదురుకాల్పుల అనంతరం భద్రత బలగాలు ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టి పెద్ద ఎత్తున బిజిఎల్‌ను స్వాధీనం చేసుకున్నారని ఎస్‌పి తెలిపారు. ఎన్‌కౌంటర్ సంబంధించి సుందర్‌రాజు పలు అసక్తికర విషయాలు తెలిపారు.
జేగురుకొండ అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు తప్పిన ముప్పు
సుక్మా జిల్లా, జేగురుకొండ అటవీ ప్రాంతలో జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీసు బలగాలకు భారీ ముప్పు తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు నేత మోస్ట్‌వాంటేడ్ (పిఎల్‌జీఎ) 1వ బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మా తన సొంత ఇలాకాలో భారీ కుట్రకు స్కెచ్ వేసినట్లు పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి. కూబింగ్ చేపట్టే జవాన్లే లక్షంగా పావులు కదిపినట్లు తెలియవస్తోంది. యుద్ధ తంత్రంలో ఆరితేరిన హిడ్మా పెద్దమొత్తంలో పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు పక్కా ప్రణళికతో ముందుకు సాగినట్లు పోలీసు అధికారులు తెలుపుతున్నారు. పోలీసు బలగాలు అప్రమత్తమవ్వడంతో భారీ ప్రాణనష్టం తప్పినట్లైంది. ఈ ఘటనతో పోలీసు అధికారులు అలెర్ట్ అయ్యారు. హిడ్మా లక్షంగా పెద్ద ఎత్తున అడవులను జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News