Friday, April 4, 2025

మావోల శాంతిబాట

- Advertisement -
- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు మూడు షరతులు పెట్టిన మావోయిస్టు
అధికార ప్రతినిధి అభయ్ కగార్ పేరిట చేస్తున్న ప్రతీఘాత యుద్ధాలు
నిలిపివేయాలి మారణహోమాన్ని ఆపివేయాలి సాయుధ బలగాల కొత్త
క్యాంప్‌ల ఏర్పాటును నిలిపివేయాలి ఈ ప్రతిపాదనలకు సమ్మతిస్తే
తక్షణమే కాల్పుల విరమణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి
తేవాలని శాంతిచర్చల కమిటీకి, మేధావులకు, జర్నలిస్టులకు వినతి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజల ప్రయోజనాల కోసం తాము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమేనని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నామన్నారు. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర (గడ్చిరౌలి), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చే స్తున్న హత్యాకాండలను, నరసంహారాన్ని(జినోసైడ్) నిలిపివేయాలని , సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే తాము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామని వెల్లడించారు. తాము చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతి చర్చల కమిటీకి,

దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ, దళిత సంఘాలకు, విద్యార్థియువజనులకు, పర్యావరణ కార్యకర్తలు  తదితరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్‌ను చేపట్టాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థను కూలదోసి సమసమాజ స్థాపన కోసం పోరాడుతుంటే బిజెపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రజా పోరాటాలను నిర్మూలించడం కోసం తూర్పు, మధ్యభారతంలో కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయన్నారు.

సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడిదార్ల, భూస్వాముల దోపిడీ, పీడనల నుండి దేశంలోని పీడిత ప్రజల, పీడిత సాంఘిక సముదాయాల, పీడిత జాతుల విముక్తి కోసం మా పార్టీ పోరాడుతుంటే ఆ పోరాటాలను అణిచివేయడానికి పట్టణాల్లో, మైదానాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయుధ పోలీసు బలగాల్ని, ఎన్‌ఐఎ లాంటి ఇంటలిజెన్స్ ఏజెన్సీలను ఉపయోగించి పోరాడే ప్రజానీకంపై దాడులు చేస్తున్నాయని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాపక్ష మేధావులపై భీమాకోరేగావ్ కుట్ర కేసును మోపి జైళ్లో బంధించాయన్నారు. విప్లవోద్యమ ప్రాంతాల్లో ఆదివాసీ యువతీయువకులను సాయుధ బలగాల్లో భర్తీ చేసుకుని వారిచేతనే ఆదివాసులను హత్యలు చేయిస్తున్నాయని ప్రకటనలో వెల్లడించారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ‘కగార్’ పేరుతో ఆదివాసీ ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను నిలిపివేయాలని, బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్‌లకే పరిమితం చేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన పట్ల స్పందించకుండా, జవాబు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 15 నెలలుగా విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాలన్నింటా.. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని తీవ్రంగా కొనసాగిస్తున్నాయన్నారు.

ఈ యుద్ధంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైబడిన సంఖ్యలో తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి చెందిన వివిధ స్థాయిల కమాండర్లను, సభ్యులను, సాధారణ ఆదివాసీ ప్రజానీకాన్ని హత్య చేశాయన్నారు. ఇందులో 1/3 సంఖ్యలో సాధారణ ఆదివాసీ ప్రజలు హత్య చేయబడ్డారన్నారు. విప్లవోద్యమ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు వేలాది మందిని అరెస్టులు చేసి అక్రమ కేసులు మోపి జైళ్ల పాల్జేస్తన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో ‘మధ్యభారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి. భారత ప్రభుత్వంసిపిఐ(మావోయిస్టు) బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి’ అనే అంశంపై మార్చి 24న హైదరాబాద్‌లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేండ్ సమావేశం నిర్వహించిందన్నారు. నేటి స్థితిలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటును, అది శాంతి కోసం రౌండ్ టేండ్ సమావేశం నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శాంతి చర్చల పట్ల తమ పార్టీ వైఖరిని తెలియపరుస్తూ.. పజల ప్రయోజనాల కోసం తాము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమేనని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News