కొత్తగూడెం: ఫాసిస్ట్ నిషేధిత తీవ్రవాద మావోయిస్టు పార్టీకి అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై కనీస మర్యాద, నైతిక వైఖరి లేదని ఎస్పీ సునీల్ దత్ మండిపడ్డారు. గిరిజన మహిళలు, బాలికలపై మావోయిస్టులు అనేక రకాల వేధింపులకు పాల్పడుతూ, వారిని అణచివేతకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన బాలికలకు చదువుకునే అవకాశం ఇవ్వడం లేదని, వారిని మావోయిస్టు పార్టీలో చేరాలని ఒత్తిడికి చేస్తున్నారన్నారు. గిరిజన యువతులను మావోయిస్టు నాయకులు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారని, మావోయిస్టులు వారికి సరైన వైద్య సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు. అనేక మంది మహిళలకు మావోయిస్టులు బలవంతంగా అబార్షన్లు చేయించారన్నారు. దండకారణ్యంలో మహిళలను మావోయిస్టులు ఒక ఆటబొమ్మలా వాడుకుంటూ, వారి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని సునీల్ దత్ పేర్కొన్నారు. అమాయకులైన ఆదివాసి మహిళలపై బలవంతంగా మావోయిస్టు సిద్ధాంతాలను రుద్దుతూ, వారిని బాహ్య ప్రపంచానికి దూరం చేస్తున్నారన్నారు.