గ్రామ కమిటీ, మిలీషియా సభ్యులు
కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ గ్రామకమిటీ సభ్యులు, మిలీషియా సభ్యులు ఐదుగురు జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ఎదుట గురువారం లొంగిపోయారు. భద్రాచలం పోలీస్‌సబ్ డివిజన్ పరిధిలోని చర్ల సర్కిల్‌లోని చర్ల మండలంలోని కొండవాయి గ్రామానికి చెందిన ఐదుగురు లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యుడు దూడి గంగ, పొడియం అడమయ్య అలియాస్ చైతు, ముస్కి కోసయ్య అలియాస్ మల్ల అనే ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులు, పొడియం రాజే, సోడి గంగి అనే మహిళా మిలీషియా సభ్యులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. చర్ల ఎల్‌ఓఎస్‌కు చెందిన ఈ ఐదుగురు కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారని వెల్లడించారు. బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి సభ్యులనుచేర్చుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇవన్ని తట్టుకోలేక, నిజానిజాలు తెలియడంతో పోలీసులు నిరంతరం కొనసాగిస్తున్న కమ్యూనిటీ పోలిసింగ్ ఫలితంగా పలువురు జనజీవనం స్రవంతిలోకి వస్తున్నారని ఎస్పీ వివరించారు.
తాము ఆయా మిలీషియా సభ్యులు, మావోయిస్టుల సభ్యుల బంధు మిత్రులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నామని ఫలితంగా పలువురు లొంగిపోతున్నారన్నారు. మిగతా వాళ్లు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు జిల్లాలో లేరని, చత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఏదో ఒక నేరం చేసి వెళుతుంటారని వారిపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశామఅన్నారు. సరిహద్దు దాటి మన జిల్లాకు వస్తే వెంటనే తమకు తెలిసిపోతుందని, తమ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉందని, మావోయిస్టులు ఏ దుశ్చర్యలకు పాల్పడుకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతలు కాపాడటంలో ముందుంటామన్నారు. ఈ సమావేశంలో 141 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ కమాండెంట్ కమల్ వీర్, అదనపు ఎస్పీ ఆపరేషన్స్ వి, తిరుపతి, భద్రాచలం ఏఎస్పీ అక్షాంస్ యాదవ్, చర్ల సిఐ అశోక్, ఎస్‌ఐ రాజు వర్మ తదితరులు పాల్గొన్నారు.