హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని 15 గ్రామాల సర్పంచులతో పాటు నర్సింహులపల్లెకు చెందిన 12 మంది గ్రామస్థులకు మావోయిస్టు నేతలు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావ్ ఉరఫ్ గణపతి సొంత జిల్లాలో ఒకేసారి 15 మంది సర్పంచ్ లకు ఆ పార్టీ పేరిట లేఖలు విడుదల కావడం కలకలం రేపుతోంది. శుక్ర, శని వారాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఈ లేఖలు అందినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలోని 15 గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసపి సభ్యులతో పాటు ఎంపిపి, తహసీల్దార్, ఎంపిడిఒలు, నర్సింహులపల్లెలోని మరో 12 మందికి హెచ్చరికలు వచ్చాయి. మావోయిస్టు గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ పేరిట లేఖలు అందాయి.
అటవీ భూములు ఆక్రమిస్తూ అక్రమంగా పట్టాలు జారీ చేస్తున్నారని, ఇందుకోసం రూ.కోట్లు దండుకున్నారని లేఖల్లో ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో నిర్వహించాల్సిన పంచాయతీలను పోలీస్ స్టేషన్ల వరకు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నర్సింహుల పల్లెలో అక్రమంగా నిర్మించిన ఓ దుకాణాన్ని కూల్చి వేయాలని హెచ్చరించారు.అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు తమ పద్దతులు మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్షించాల్సి వస్తుందని తెలిపారు. మరోవైపు ఈ లేఖలను నిజంగానే మావోయిస్టులు జారీ చేశారా? లేక ఎవరైనా కావాలని చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బాధితులు ఎస్‌పితో పాటు సిఐ, ఎస్‌ఐలను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నట్లు తెలిసింది. ఈ లేఖల విషయాన్ని ఎస్‌పి భాస్కర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఈ విషయంపై బీర్‌పూర్ ఎస్‌ఐ అజయ్‌ను వివరణ కోరగా పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని వెల్లడించారు. మరోవైపు తెలంగాణ సర్కారుకు ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ రాయడం కలకలం సృష్టించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవా లని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రైతులు పంట నష్ట పరిహారం కోసం పోరాడాలని మావోయిస్టులు పిలుపు నిచ్చారు.
ఇదిలా ఉండగా, ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్‌పి కె సురేష్ కుమార్ తెలిపారు. శనివారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ లో ఎస్‌పి సురేష్ కుమార్ మట్లాడుతూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచి కలపేట్ మండలం మురళిగూడా గ్రామపంచాయతీలోని జిల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనంద్‌రావు, నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోరిటికల్ గ్రామానికి చెందిన చేన్నగొని గణేష్‌లను బెజ్జూర్ అటవి ప్రాంతంలో మావోయిస్డులను కలిసేందుకు వెళుతుండగా పట్టుకున్నట్టు ఎస్‌పి తెలిపారు. వారి వద్ద నుండి 5 జిలేటిన్ స్టిక్స్, 15 డిటోనేటర్లు, పార్టీ ధ్రువపత్రాలు, రెండు సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.