అది ప్రహసనప్రాయమన్న కాంగ్రెస్
ముంబయి : మహారాష్ట్ర శాసనసభ ఆమోదించిన మరాఠా కోటా బిల్లు న్యాయవ్యవస్థ పరిశీలనలో వీగిపోతుందని కాంగ్రెస్ మంగళవారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మరాఠాలను, ఒబిసిలను వంచించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ ప్రక్రియ ‘ప్రహసనప్రాయం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెట్టివార్ విమర్శించారు. విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో మరాఠా సమాజానికి పది శాతం రిజర్వేషన్ కల్పించే మహారాష్ట్ర రాష్ట్ర సామాజిక, విద్యా వెనుకబడిన వర్గాల బిల్లు 2024ను రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సెషన్‌లో ఏకగ్రీవంగా ఆమోదించింది.
కాగా, రిజర్వేషన్ మంజూరు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందా అని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రశ్నించారు. ‘మరాఠా రిజర్వేషన్‌పై చట్టాన్ని గతంలో కూడా ఆమోదించారు. కాని దానిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనిని (బిల్లు ఆమోదాన్ని) ఎన్నికలకు ముందు సరిగ్గా చేశారు’ అని రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వడెట్టివార్ విలేకరులతో చెప్పారు. ‘ఎన్నికలలో గెలుపు కోసం ఇది ఒక ప్రహసనం. ప్రభుత్వం మరాఠా ప్రజలను, ఒబిసిలను వంచించింది’ అని వడెట్టివార్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనం కోసం బిల్లు ఆమోదాన్ని ప్రభుత్వం చూపుతుందని ఆయన ఆరోపించారు.