ఇప్పటికైనా పునరాలోచించి తేమ
శాతం నిబంధనలను సడలించాలి
ప్రతిరోజు భారీగా ధాన్యాన్ని
కొంటున్నాం, సేకరణలో జాతీయ
రికార్డు సాధించాం, ఈ గొప్పతనం
సిఎం కెసిఆర్‌కే చెందుతుంది :
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్లే రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అకాల వర్షాల వల్లకూడా ధాన్యం కొనుగోలులో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కోనుగోలుపై తీసుకున్న చర్యలు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమశాతం గరిష్టంగా 17 శాతం, చెత్త, తాలు, 1శాతం, మట్టి పెద్ద లు, రాళ్లు, 1 శాతం ఇలా అనేక నిబంధనలు ఉన్నాయన్నా రు. ఈ నిబంధనలకు లోబడి కొనుగోళ్లు జరపవాల్సి ఉంటుందని, వర్షాలతో తేమ శాతం తగ్గటం లేదన్నారు. తేమ శాతం తో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, కేంద్ర నిబంధనలను దృష్టిలో పెట్టుకుని రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
తేమ శాతం విషయంలో కేంద్రం తన నిబంధనలను సడలిస్తే ధాన్యవ కొనుగోలు చేయడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల రైతులకు కొంత ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవమని , ప్రకృతి వైపరిత్యాలను ఎవరు ఎమీ చేయలేమని , అయితే వాటిని ఎదుర్కొని రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే , ఈ ఏడాది దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు తెలిపారు. రైతాంగానికి ఇబ్బంది కలుగుతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని , ప్రతి రోజు లక్షకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. రైతాంగం కూడా పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తుచేశారు.వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సూచించారు.
కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించిందని కేవలం ఏడు సంవత్సరాల్లో 88 వేల కోట్ల రూపాయలు విలువ చేసే 5కోట్ల 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అఖండ విజయం ముమ్మాటికి గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశఖరరావు వల్లే సాధ్యమైందన్నారు. దేశంలో ఈ విధంగా ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఘనత… గొప్పతనం సిఎం కేసిఆర్‌కే చెందుతుందన్నారు.ధాన్యం కొనుగోళ్లు ఆర్థికంగా భారం కావడంతో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయి కొనుగోలుకు ముందుకు రాని నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆర్థికభారమైనా భరించి రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఏడాది 2014-15 లో 24,29 లక్షల మెట్రిక్ టన్నులు, 2015-16లో 23.56 లక్షల మెట్రిక్ టన్నులు, 2016-17లో 35.70 లక్షల మెట్రిక్ టన్నులు, 2017-18లో 53.99 లక్షల మెట్రిక్ టన్నులు, 2018-19లో 77.46 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20లో కోటి 11లక్షలు, 2020-21లో కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసినట్టు వివరించారు. ఈ ఏడాది వానాకాలంలో ఇప్పటి వరకు 5,703 కొనుగోలు కేంద్రాల ద్వారా 19 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇది తెలంగాణ రైతాంగం సాధించిన విజయం అని తెలిపారు.ఇలాంటి సమయంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం భాధాకరం అన్నారు. ఇంతటి విజయాలను సాధించిన తెలంగాణ రైతుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:సంమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు గతంలో లేని నిబంధనలు పెట్టి గడిచిన ఏడాదికాలంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.