Saturday, November 9, 2024

‘మార్గదర్శి’ దర్యాప్తు వ్యవహారంలో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలకు సంబంధించి దర్యాప్తు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధుల మళ్లింపు, అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎపి సిఐడి మంగళవారం ఓ కీలక ప్రకటన చేసింది. మార్గ దర్శిలో రూ.కోటిపైన నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రెస్ నోట్‌లో తెలిపింది. మార్గదర్శి కేసు దర్యాప్తులో భాగంగా కోటి రూపాయలకు పైగా నగదు రూపంలో చందాలు కట్టిన చందాదారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు సిఐడి ఓ ప్రకటన విడుదల చేసింది.

రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిబంధనల్ని ఉల్లంఘించి కోటి రూపాయలకు మించి నగదుతో చిట్స్ వేసిన వారికి నోటీ సులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. కోటి రూపాయలకు పైగా చిట్స్ వేసిన వ్యక్తిగత చందాదారులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నట్లు తెలిపింది. ఆర్‌బిఐ, సిబిడిటి నిబంధనల ప్రకారం నోటీస్‌లు జారీ చేసినట్లు ఎపి సిఐడి సదరు నోట్‌లో పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు లావాదేవీల వివరాలు తెలపాలని పేర్కొంది. ఆర్థిక నేరాల, మనీ లాండరింగ్ నివారణకు ఆర్‌బిఐ, సిబిడిటి తీసుకొచ్చిన నిబంధనల మేరకే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఎపి సిఐడి స్పష్టం చేసింది.

కోటి రూపాయలకు పైగా చిట్ గ్రూపుల్లో నగదు డిపాజిట్ చేసిన చందాదారులపై సిఐడి ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఐడి అదనపు డిజి ఎన్ సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న చందాదారులందరూ విచారణకు సహకరించాలని ఎపి సిఐడి కోరింది. ఖచ్చితమైన సమాచారం అందించడం ద్వారా నిజం బయటపడుతుందని, నిజం బయటకు తీసుకుని వచ్చి దోషులను న్యాయస్థానానికి తీసుకు రావడంలో చందాదారులు అధికారులకు సహాయపడాలని కోరారు. నిష్పాక్షికమైన విచారణ జరిగేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సంజయ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News