న్యూఢిల్లీ, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన మార్గరేట్ ఆల్వా విపక్షాల తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. ఆదివారం ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ నివాసంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో 80ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరేట్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, డిఎంకె నేత టీఆర్ బాలు, శివసేన నేత సంజయ్ రౌత్,సిపిఐ, సిపిఎం నేతలు డి.రాజా, సీతారాం ఏచూరి, బినయ్ విశ్వం, ఎండిఎంకె నేత వైగో, సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాంగోపాల్ యాదవ్, ఆర్‌జెడి నేత అమరేంద్ర ధన్‌సింగ్‌తో పాటు టిఆర్‌ఎస్ నేత కేశవరావు హాజరయ్యారు. టిఎంసి, ఆమ్ ఆద్మీ పార్టీ డుమ్మా కొట్టాయి. మార్గరేట్ ఆల్వా ఎంపికకు 17 పార్టీలు అంగీకారం తెలిపినట్లు శరద్‌పవార్ వెల్లడించారు. మంగళవారం ఆమె నామినేషన్ దాఖ లు చేస్తారని తెలిపారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్ పేరును ప్రకటించడం పట్ల కన్నడ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
మార్గరెట్ ఆల్వా 1942 ఏప్రిల్ 14న మంగళూరులో జన్మించారు. బెంగళూరు మౌంట్ కార్మెల్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె బెంగళూరు లా కాలేజీలో న్యాయవాద విద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా రాణిస్తూనే కాం గ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేశారు. 1964లో నిరంజన్ ఆల్వాను వివాహమాడారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతగా వ్యవహరించారు. 1991 నుంచి 2004 దాకా పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగారు. కేంద్ర కేబినెట్‌లో పలు మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో కొనసాగారు.
విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం పట్ల మార్గరెట్ ఆల్వా ట్విటర్‌లో స్పందించారు. తనను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. విపక్షాల నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని పేర్కొన్న ఆమె.. తనపట్ల విశ్వాసం ఉంచిన నేతలందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
It is a privilege and an honour to be nominated as the candidate of the joint opposition for the post of Vice President of India. I accept this nomination with great humility and thank the leaders of the opposition for the faith they’ve put in me.
Jai Hind 🇮🇳
— Margaret Alva (@alva_margaret) July 17, 2022