Thursday, November 14, 2024

మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి కథా చిత్రం

- Advertisement -
- Advertisement -
  • విఆర్‌ఎ సస్పెన్సన్
  • మరొక రెవెన్యూ అధికారిపై వేటుకు రంగం సిద్ద్ధం
  • మన తెలంగాణ శీర్షికకు స్పందన
  • ఘటనపై కలెక్టర్ సీరియస్
  • రైతు బుచ్చన్న భూమిని తిరిగి రిజిష్టర్ చేసిన విఆర్‌ఎ భార్య
  • ఊపిరిపీల్చుకున్న రైతు బుచ్చన్న
  • మన తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపిన రైతు

మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట జిల్లా మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ లీలలు అంత ఇంత కాదు. రెవెన్యూ కార్యాలయంలో గత మూడు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైతు బుచ్చన్నను మోసం చేసిన రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆదేశాలతో ఖంగుతిన్నారు.

రైతు బుచ్చన్నకు చెందిన వ్యవసాయ భూమిని అక్రమంగా రిజిష్టర్ చేసుకొని ధరణిలో నమోదు చేసుకున్న విషయాలను వరుస కథనాలతో మన తెలంగాణ దిన పత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన కలెక్టర్ హర్స కోయ మరికల్ తహసీల్దార్ కార్యాలయం అధికారులపై సీరియస్ అయ్యారు. ఇందుకు కారణమైన విఆర్‌ఎను ససెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరొక రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

శాఖపరమైన చర్యలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సొంత చిన్నాన రైతు బుచ్చన్నకు చెందిన 30.30 గుంటలను అక్రమంగా ధరణిలో తన భార్య, అన్న భార్యలపై రిజిష్టర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రైతు బుచ్చన్న కూతురు నీలమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో కేసు కూడా నమోదైంది. ఈ విషయాలపై మన తెలంగాణ పత్రిక వరుస కథనాలతో ప్రచురించింది. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో నిజం తేలడంతో విఆర్‌ఎ సస్పెన్సన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే సస్పెన్సన్‌కు ముందు రోజే విఆర్‌ఎ తన భార్య పేరుతో రిజిష్టర్ చేసుకున్న భూమిని, తన అన్న భార్య భూమిని తిరిగి రైతు బుచ్చన్నకు రిజిష్టర్ చేయడంతో కథ సుఖాంతమైంది అయితే రైతు బుచ్చన్న భూమిని రిజిష్టర్ చేయడంతో విఆర్‌ఎ చేసిన అవినీతి, అక్రమాలు రుజువు అయినట్లేనని భావిస్తున్నారు. ఈ విషయంపై మరికల్ తహసీల్దార్‌ను వివరణ కోరగా విఆర్‌ఎ హనుమంతును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇందులో మరొక రెవెన్యూ అధికారిపై చర్యలు ఉంటాయా అన్న ప్రశ్నకు ఆయన ఇప్పటి వరకు అయితే విఆర్‌ఎపై చర్యలు తీసుకున్నామని, ముందు ముందు ఎలా ఉంటుందో పై అధికారులు నిర్ణయం బట్టి ఉంటుందని ఆయన మన తెలంగాణకు తెలిపారు.

విఆర్‌ఎనే షాడో అధికారి

సస్పెన్సన్ గురైన విఆర్‌ఎనే కార్యాలయంలో అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఏ పని కావాలన్నా ఈయన ద్వారానే జరుగుతోందన్న భావన కల్గించి చక్రం తిప్పేవారని తెలుస్తోంది. భూములు, ఇతర సర్టిఫికెట్లు కోసం అధికారుల కంటే విఆర్‌ఎను కలిసి పనులు చేయించుకునే వారని తెలుస్తోంది. ప్రతి ఒక్కరి నుంచి మామూళ్లు ఈయనే వసూళ్లు చేసుకునే వారని మరి కొందరు ఆరోపిస్తున్నారు.

మన తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపిన రైతు కుటుంబీకులు

రైతు బుచ్చన్నకు జరిగిన అన్యాయంపై మన తెలంగాణలో కథనాలు రావడంతో పాటు కలెక్టర్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రైతు బుచ్చన్నకు న్యాయం జరిగింది. తమ భూమి తమకు దక్కింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌తో పాటు మన తెలంగాణకు రైతు బుచ్చన్నతో పాటు ఆయన కూతురు నీలమ్మ థ్యాంక్స్ చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News