Wednesday, January 29, 2025

పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి మాయం

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్‌లో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తుండగా వల పన్ని పట్టుకున్న పోలీసులు పట్టుబడ్డ గంజాయిని భద్రంగా ఉంచాలనే విషయాన్ని మాత్రం మరిచిపోయారు. పట్టుబడ్డ 70 కిలోల గంజాయిని అంబులెన్స్‌లోనే ఉంచి దానిని పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిలపగా, పోలీసుల కన్నుగప్పి ఆ 70 కిలోల గంజాయిని ఎవరో మాయం చేశారు. చాల రోజుల తర్వాత అంబులెన్స్ అద్దాలు ధ్వంసమై ఉండటం… అందులోని గంజాయి మాయం కావడాన్ని పోలీసులు గుర్తించారు. అయితే పట్టుబడ్డ గంజాయిని భద్రపరచడంలో నిర్లక్షంగా వ్యవహరించడమే కాకుండా స్టేషన్ ఆవరణలో నిలిపిన అంబులెన్స్ నుంచి గంజాయి మాయం కావడాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఇద్దరు ఎస్‌ఐలతో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజి రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 కిలోల గంజాయిని కొనుగోలు చేసి అంబులెన్స్‌లో రాజస్థాన్‌కు తరలించే క్రమంలో గత సంవత్సరం ఫిబ్రవరి 1న సారంగాపూర్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. అంబులెన్స్‌లో ఉన్న 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విక్రయించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. పట్టుబడ్డ గంజాయిని అదే అంబులెన్స్‌లో ఉంచి సారంగాపూర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిలిపిన పోలీసులు ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారు. గంజాయి పట్టుబడ్డ 13 నెలల తర్వాత అంబులెన్స్ అద్దాలు ధ్వంసమై ఉండటం… అందులోని గంజాయి కనిపించకుండా పోవడాన్ని పోలీసులు గుర్తించారు.

పోలీస్‌స్టేషన్ నుంచి గంజాయి మాయం కావడాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్‌పి సన్‌ప్రీత్ సింగ్ విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించి స్టేషన్ నుంచి గంజాయి మాయం కావడానికి నలుగురిని బాధ్యులుగా గుర్తించి వారిపై పోలీస్ శాఖ వేటు వేసింది. గంజాయి పట్టుబడ్డ సమయంలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తించిన మనోహర్‌రావు, ప్రస్తుత ఎస్‌ఐ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్‌రెడ్డి, కానిస్టేబుల్ నరేందర్‌లను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ 1 ఐజి రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు వెల్లడించారు. పోలీస్ కనుసన్నలలో ఉన్న దానికే రక్షణ లేకపోతే ఎలా అంటూ పోలీసుల నిర్లక్షంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కాగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిలిపిన అంబులెన్స్ నుంచి ఇద్దరు మైనర్లు గంజాయిని మాయం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News