మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ ప్రగతి పథంలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు విశ్రాంతి భవనంలో మున్సిపాలిటీలోని వివిధ రకాల వ్యాపారవేత్తలతో నిర్వహించిన సమావేశానికి జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాస్‌రావులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మరిపెడ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, మరిపెడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. అందులో భాగంగానే మరిపెడ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మరిపెడను మున్సిపాలిటీగా బిఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు చేసిందన్నారు. నూతన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నాలుగేళ్ల క్రితం కెసిఆర్ ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇట్టి నిధులతో రూ. 3 కోట్లతో మోడల్ మార్కెట్, రూ. 3 కోట్లతో ఆడిటోరియం, రూ. 65 లక్షలతో మరిపెడలో వైకుంఠధామం, రూ. కోటి 30 లక్షలతో అన్ని వార్డుల్లో సిసి డ్రైన్స్, రూ. 80 లక్షలతో మరిపెడకు బిటి రోడ్డు, రూ. 65 లక్షలతో మన పట్టణం మన బడికి, రూ. 2 కోట్లతో మరిపెడ నుండి సాయిబాబా గుడి వరకు తారురోడ్డు, రూ. 30 లక్షలతో మరిపెడలో ఎస్‌సి కమ్యూనిటీ హాల్, రూ. 18 లక్షలతో ఎస్‌సి కాలనిలో పార్క్, రూ. 2 కోట్లతో పార్క్, అన్ని వార్డుల్లో సిసి రోడ్లు, మినీ ట్యాంకు బండ్ తదితర అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.
ఇటివల సిఎం కెసిఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మరో రూ. 25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇట్టి నిధులలో రూ. 10 కోట్లతో 15 వార్డుల్లో సిసి డ్రైన్ నిర్మాణానికి ప్రతి వార్డుకు రూ. 65 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. పట్టణంలోని సేవానగర్, గ్యామాతండా, మందుల వాడ, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని, సమస్యలను పరిష్కరించేందుకు రూ. 2 కోట్లతో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామని, పట్టణంలో పలు వార్డుల్లో ఇళ్లపై నుంచి వెళ్లే విద్యుత్ లైన్లు, విద్యుత్ తీగలు, స్తంభాల పుణరుద్ధరణకు రూ. 2 కోట్లు, ప్రతి వర్షాకాలంలో కార్గిల్ సెంటర్ వద్ద వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్యలను పరిష్కరించేందుకు సుమారు రూ. కోటి 30 లక్షలతో డైనేజీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
రూ. 2 కోట్లతో రజకులకు దోబీఘాట్, రూ. కోటి 50 లక్షలతో పట్టణ కేంద్రంలో ఆధునాతనమైన వైకుంఠధామం, స్ధానిక దారం రామయ్య ఇంటి నుంచి మాకుల గుడి వరకు రోడ్డు విస్తరణ చేసి బిటి రోడ్డుకు రూ. 50 లక్షలు, మాకుల దేవస్ధానాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సమీపంలోని పెద్ద చెరువును మినీ ట్యాంకు బండ్‌గా తీర్చిదిద్దడానికి రూ. 2 కోట్ల 50 లక్షలు, ఆడిటోరియంలో ఏసి అమర్చడానికి రూ. 30 లక్షలు, డోసర్, జెసిబి కొనుగోలుకు రూ. 65 లక్షలు, స్లాటర్ హౌజ్ నిర్మాణానికి రూ. 65 లక్షలు, మున్సిపల్ భవన నిర్మాణానికి రూ. 3 కోట్లు, మారో మోడల్ మార్కెట్ నిర్మాణానికి రూ. 2 కోట్ల 50 లక్షలు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. టెండర్లు పిలిచి త్వరలో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మరిపెడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దే బాధ్యత నాదన్నారు.
అందరి సహకారంతో మరిపెడ పట్టణాన్ని మోడల్ సిటిగా మార్చుతానని తెలిపారు. మున్సిపాలిటీలో మౌళిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. మొదటి నుంచి మరిపెడ మండలం మంచి మెజార్టీ ఇచ్చిందని, మీ అండదండలతోనే నేను ఈ స్ధాయికి వచ్చానన్నారు. నియోజకవర్గం దేవాలయం అని ప్రజలు నా దేవుళ్లని తెలిపారు. ఇంటి పన్నుల విషయంలో కొంచెం అసంతృప్తిగా ఉన్నారని, అందరి మనసులో ఉందని, ఇట్టి విషయం గురించి కౌన్సిల్ సమావేశంలో చైర్‌పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లతో మాట్లాడి పన్నుల విషయాన్ని చూడమని చెప్తానన్నారు. ఏ ఎన్నికైన మరిపెడ మండలం పూర్తి మద్ధతు ఇచ్చి గెలిపించారని, ఎప్పటిలాగానే నన్ను ఆశీర్వదించి మరోమారు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్, ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపిపి గాదె అశోక్‌రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, ఫస్ట్‌క్లాస్ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుత్‌రావు, మండల పార్టీ అధ్యక్షులు రామసహాయం సత్యనారాయణరెడ్డి, మాజీ జడ్‌పిటిసి బాల్ని మాణిక్యం, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర్‌రావు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఉప్పల జాషువా వెంకటేశ్వర్లు, మచ్చ వెంకటనర్సయ్య, అజ్మీర రెడ్డినాయక్, గంట్ల మహిపాల్‌రెడ్డి, గంధసిరి కృష్ణ, రవి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పట్టణ వివిధ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.