Tuesday, January 21, 2025

భార్యపై భర్త అత్యాచారం శిక్షార్హమా ? కాదా?

- Advertisement -
- Advertisement -

వైవాహిక అత్యాచారం మీమాంసలో ఇమిడి ఉన్న చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. మైనర్ కాని భార్యను భర్త లైంగిక చర్యకు పురికొల్పినా, లేక లైంగిక అత్యాచారానికి పాల్పడినా సదరు భర్త శిక్షకు గురి కావచ్చా? వైవాహిక బంధంతో భర్త అయినందున ఆయనకు శిక్షల నుంచి మినహాయింపు లేదా రక్షణ ఉంటుందా? సంబంధిత రాజ్యాంగ చెల్లుబాటు వీలవుతుందా? అనే విషయాలను రాజ్యాంగ ధర్మాసనం విశ్లేషిస్తుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జె బి పార్ధీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సంబంధిత విషయంలో తమ ముందుకు వచ్చిన వ్యాజ్యాన్ని గురువారం విచారణకు చేపట్టింది. భార్యపై అత్యాచారానికి భర్త అత్యాచారానికి పాల్పడటం, అంటే ఆమె సమ్మతి లేకుండా లైంగిక చర్యకు దిగడం జరిగితే మినహాయింపులు ఉంటాయా? అనేది కీలక విషయం అయింది.

భారతీయ శిక్షా స్మృతి (ఐపిసి), భారతీయ న్యాయ సన్హిత (బిఎన్‌ఎస్) లోని నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? భర్త శిక్షార్హుడు కాకుండా చేసేందుకు రాజ్యాంగపరంగా చెల్లుబాటు ఉంటుందా? అనేది సుప్రీంకోర్టు ఖరారు చేసుకుంటుంది. కేసుకు సంబంధించి పిటిషనర్ తరఫు న్యాయవాది కరుణ నుండీ కీలక విషయాలను ప్రస్తావించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో లేవనెత్తిన వాదన అనుచితం అని తెలిపారు. భర్త అయినప్పటికీ మహిళ ఇష్టం లేకుండా అత్యాచార చర్యకు పాల్పడితే సదరు వ్యక్తి శిక్షార్హుడే అని కేంద్రం పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం వాదన ప్రమాదకరంగా ఉందని, వైవాహిక బంధంలో ఉండే ఆంతరింగిక అత్యంత సున్నితమైన పడకింటి ఆంతరంగిక బంధానికి ఇది విఘాతం అవుతుందని సీనియర్ న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. ఐపిసి, బిఎన్‌ఎస్ నిబంధనలు వైవాహిక అత్యాచారం విషయంలో పేర్కొన్న విషయాల గురించి ప్రస్తావించి తమ వాదనలు విన్పించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పందించారు.

ఇది రాజ్యాంగపరమైన కీలక ప్రశ్న. ఇప్పటికే సంబంధిత విషయంలో తమ ముందుకు రెండు తీర్పులు ప్రస్తావనకు వచ్చాయని, తాము పరిశీలించాల్సి ఉందని వివరించారు. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. శిక్షార్హ నిబంధనలు రాజ్యాంగబద్ధమా కాదా అనేది ప్రధాన విషయం అని తెలిపారు. అయితే రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక నిబంధనను కొట్టివేయాల్సి ఉందని పిటిషనర్ల తరఫు ఒక న్యాయవాది తమ వాదన విన్పించారు. దీనిపై ధర్మాసనం స్పందించింది. ‘ సదరు నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అంటే సమానత హక్కు, ఇక ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 (జీవనం, వ్యక్తిగత స్వేచ్ఛ)ను కాలరాస్తుందని మీరు (లాయర్) అంటున్నారు. అయితే పార్లమెంట్ ఇటువంటి నిబంధన ఎత్తివేత క్లాజ్ తీసుకువచ్చింది. 18 సంవత్సరాలు పైబడ్డ భార్యతో లైంగిక చర్యకు పాల్పడితే అది రేప్ కిందికి రాదనే కట్టుబాటును ఎత్తివేయాలనే సవరణ తీసుకువచ్చారు.

’ ఇది చాలా సంక్లిష్టమైన అంశం అవుతోంది. పీనల్ కోడ్ పరిధిలోని శిక్షార్హ అతీత క్లాజ్‌ను ఎత్తివేయడమా? లేక ఇటువంటి కేసులను నిర్థిష్ట ప్రత్యేక పరిధిలోకి తీసుకువచ్చి , వీటిని ప్రత్యేక నేరాల పరిధిలో విచారించి శిక్ష పరిధి నుంచి తొలిగించే క్లాజ్ చెల్లుబాటును పరిశీలించడమా అనేది తాము తేల్చుకోవల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. కేసు విచారణ సశేషంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News