Tuesday, December 24, 2024

మరియుపోల్ రష్యా వశం

- Advertisement -
- Advertisement -

Mariupol occupied by Russia

సేనలకు పుతిన్ అభినందనలు
అజోవ్‌స్తల్ స్టీల్‌ప్లాంట్‌పై దాడికి
బదులుగా ప్లాంట్‌ను చుట్టుముట్టాలని ఆదేశం

మాస్కో: ఉక్రెయిన్ నగరం మరియుపోల్ పూర్తిస్థాయిలో రష్యా పరమైనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఆ ప్రాంతానికి విజయవంతంగా విముక్తి లభించిందంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఓ వార్తాసంస్థ ప్రకటించింది. అయితే అక్కడి అజోవ్‌స్తల్ స్టీల్‌ప్లాంట్‌పై దాడి చేయడానికి బదులు దానిని చుట్టుముట్టాలని తనసైన్యానికి సూచించినట్లు తెలిపింది. భారీ వైశాల్యంతో ఉన్న ఆ స్టీల్‌ప్లాంట్‌లో దాదాపు 2 వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఉండే అవకాశముందని గతంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు అధ్యక్షుడికి వెల్లడించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న పుతిన్ రష్యా సైనికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని దాడికి బదులు ముట్టడించేలా ఆదేశించారు. ఈ దిగ్బంధంతో ఈగకూడా లోపలికి వెళ్లదని అన్నారు. అలాగే ప్లాంట్‌లో ఉండే ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని , వారికి ఎటువంటి హానీ తలపెట్టమని, వైద్య సహాయం అందిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా అక్కడ చిక్కుకుపోయిన ప్రజలను తరలించడంకోసం మానవతా కారిడార్ కింద బుధవారం కొన్ని బస్సులు బయలుదేరాయని అధికారులు తెలిపారు.

గురువారం క్రెమ్లిన్‌లో రక్షణ మంత్రిసెర్గీ షోయిగుతో జరిగిన భేటీలో పుతిన్ మాట్లాడుతూ ‘ మరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య పూర్తికావడం చాలా గొప్ప విషయం. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.అక్కడి పారిశ్రామిక ప్రాంతంపై దాడి చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పటినుంచి రష్యా ఈ నగరంపై తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఎంతో మంది చనిపోగా పలువురు ఆ నగరంలో చిక్కుకు పోయారు. ఈ నగరాన్ని చేజిక్కించుకోవడం రష్యాకు అత్యంత కీలకం. రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌కు, పుతిన్ ఆక్రమించిన క్రిమియాకు మధ్యలో మరియుపోల్ ఉంది.

అంటే ఇకనుంచి క్రిమియాకు, డాన్‌బాస్ ప్రాంతానికి మధ్య భూ మార్గంలో రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. మరోవైపు డాన్‌బాస్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ విజయం కోసం పశ్చిమ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలు సమకూర్చేందుకు సంసిద్ధమయ్యాయి. ఉక్రెయిన్‌కు మరో 20 యుద్ధ విమానాలను అందించడానికి పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. విడిభాగాల సరఫరాలు, మరమ్మతులు వేగవంతం చేయడం కూడా ఉక్రెయిన్‌కు కలిసి వచ్చింది. ఈ సారి హెలికాప్టర్ల్లను కూడా ఇవ్వనున్నట్లు పెంటగాన్ అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News