కెనడా ఫెడరల్ ఎన్నికల్లో ప్రధాని మార్క్ కార్నీ సారథ్యంలోని లిబరల్ పార్టీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీనితో మార్క్ కార్నీ మరొకసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు కార్నీ గతంలో పలు మార్లు వెల్లడించారు. లిబరల్ పార్టీ ఘన విజయం నేపథ్యంలో మార్క్ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన పట్ల ఉన్న నిబద్ధతను మోడీ ప్రస్తావిస్తూ, కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కలసి పని చేయడానికి భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు. గత ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బ తిన్న విషయం విదితమే. ముఖ్యంగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌హత్య విషయంలో కెనడా ప్రభుత్వం భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
రెండు దేశాలు దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే వరకు పరిస్థితులు వెళ్లాయి. అనంతరం ట్రూడో సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. భారత్‌తో దెబ్బ తిన్న సంబంధాల పునరుద్ధరణకు, విభేదాల పరిష్కారానికి కృషి చేస్తామని కార్నీ గతంలోనే సంకేతాలు వదిలారు. భారత్‌తో కెనడియన్లకు వ్యక్తిగత, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని ఆయన గుర్తించారు. న్యూఢిల్లీతో దౌత్య, వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటామని కార్నీ హామీ ఇవ్వడం ఉభయ దేశాల మధ్య సహకారానికి, ముఖ్యంగా వాణిజ్యం బలోపేతానికి, కెనడాలో విద్య అభ్యసించే భారతీయ విద్యార్ధులకు సానుకూల పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కార్నీ నాయకత్వంలో భారత్ కెనడా ద్వైపాక్షిక బంధం తిరిగి బలపడుతుందని వారు ఆశిస్తున్నారు,