Monday, January 20, 2025

బిజెపి టికెట్ల పంపిణీలో ఈటెల మార్క్…

- Advertisement -
- Advertisement -

పెద్దసంఖ్యలో తన అనుచరులకు బీఫామ్‌లు
నాలుగు జాబితాల్లో సుమారు 45 మందికి అవకాశం
బిసివాదం పార్టీ నిర్ణయం వెనక్క ఆయనదే కీలక పాత్ర

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల సమరం జోరందుకుంది. ఇప్పటికే పార్టీలన్ని రేసు గుర్రాల జాబితా విడుదల చేయడంతో ప్రచారంలో దూసుకపోతున్నారు. అభ్యర్థులంతా అభివృద్ది, యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలిస్తూ ఓటర్లు తమవైపు మళ్లేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. కానీ కమలనాథులు మాత్రం కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిఎస్పీ పార్టీలకు విభిన్నంగా బిసి ముఖ్యమంత్రి పేరుతో ఎన్నికల రణరంగంలోకి వెళ్లుతున్నారు.

ఈసారి తెలంగాణలో బిజెపికి అధికారం కట్టబెడితే రాష్ట్ర చరిత్రలో ఎవరు ఊహించని విధంగా బిసి ముఖ్యమంత్రి చేసి సామాజిక న్యాయం పాటిస్తామని ప్రసంగాలు దంచుతున్నారు. మతవాదంతో ఎన్నికల బరిలో నిలిచే కమలం పార్టీ ఈసారి బిసి నినాదం తీసుకోవడం కొంత విపక్ష పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. దీనికంతటి కారణం ఆపార్టీలో ఏడాదిన్నర క్రితం చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అంటూ పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హోంమంత్రి అమిత్‌షా సూర్యాపేట బహిరంగ సభలో బిసి సిఎం ప్రకటన చేయించడంతో పాటు నోటిఫికేషన్ వచ్చిన తరువాత అభ్యర్థుల ఎంపికలో కూడా సగం సీట్లు బిసిలకు కేటాయించాలని ప్లాన్ చేసి ప్రకటించిన ప్రతి జాబితాల్లో ఎక్కువ సంఖ్యలో బిసిలకు అవకాశం కల్పించారు.

ఇప్పటివరకు నాలుగు జాబితాలు విడుదల చేస్తే అందులో 33 సీట్లు బిసిలకు ఇవ్వగా జనరల్ స్థానాల్లో 12 సీట్ల వరకు ఈటెల సిఫారసు చేసిన వారికే వచ్చినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఆయన ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు, గతంలో ఎన్నడూ లేని విధంగా బిజెపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా ప్రజలు ఆశ్చర్యానికి గురైతున్నారు. ఇప్పటివరకు ఏపార్టీ టికెట్లు ప్రకటించినా బిసిలకు 25 సీట్లకు మించి ఇవ్వలేదు ఒక కమలం పార్టీ ఇవ్వడం బిసి సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు ఈనెల 7వ తేదీన ఎల్బీస్టేడియంలో బిసి ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసి దానికి పెద్ద సంఖ్యలో బిసిలను తరలించి విజయవంతం చేయడంతో ఆపార్టీ హస్తిన పెద్దలు కూడా బిసివాదం ప్రధాన ఏజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలిసింది. అదే విధంగా ఎస్సీ వర్గాలను కూడ దగ్గర చేసుకునే క్రమంలో ఈనెల 11న మాదిగ విశ్వరూపం పేరుతో పరేడ్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో ఇది కూడా పార్టీకి బలం పెరుగుతుందని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు.

ఇలాంటి నూతన విధానాలు రూపకల్పన చేయడంలో ఈటెల ప్రధాన భూమికగా ఉన్నారని, ఇప్పటివరకు టికెట్లు పొందిన అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గానికి ఈటెల రాజేందర్ ప్రచారం చేయాలని కోరుతున్నట్లు అభ్యర్థుల అనుచరులు పేర్కొంటున్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఈటెల రాజేందర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News