హెచ్ 1 బివీసాకు వెసులుబాట్లు
వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బి వీసా ఎంప్లాయర్స్‌కు ఘన విజయం దక్కింది. మార్కెట్ రిసర్చ్ అనాలిస్టులను ప్రత్యేక వృత్తి నైపుణ్య పరిధిలోని వారిగా అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) గుర్తించింది. ఈ మేరకు అమెరికా ప్రముఖ సంస్థలతో రాజీకి వచ్చింది. విదేశీ వృత్తి నిపుణులను అమెరికా సంస్థలు హెచ్ 1 బివీసాల ప్రాతిపదికన కీలక ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాయి. పలు వృత్తి విద్య నైపుణ్యవంతులకు ప్రాధాన్యతాక్రమంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు హెచ్ 1 బి వీసా దరఖాస్తుల నిర్థారణ విషయంలో మార్కెట్ రిసర్చ్ అనాలిస్టును కూడా పరిగణనలోకి తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు వీసాల అధికారిక సంస్థ ప్రకటించింది.
ఇప్పటి వరకూ ప్రత్యేక నైపుణ్య జాబితాలోకి వీరిని యుఎస్‌సిఐఎస్ చేర్చలేదు. దీనిపై పలు సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఈ దశలో సంస్థలకు వీసాల సంస్థకు మధ్య కుదిరిన ఒప్పందాని కాలిఫోర్నియా ఫెడరల్ డిస్ట్రిక్ కోర్టు ఆమోదం తెలిపింది. దీనితో ఇప్పటివరకూ మార్కెట్ రిసర్చ్ అనాలిస్టులకు నిలిపివేస్తూ వచ్చిన హెచ్1 బి వీసాల దరఖాస్తులను తిరిగి పరిశీలించేందుకు వీలేర్పడింది. ఈ మేరకు కంపెనీలు అధికారిక సంస్థలను అభ్యర్థించడానికి అవకాశం కల్గింది. వివిధ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల పురోగతి దిశలో మార్కెట్ అనాలిస్టు పోస్టులలో సంబంధిత విద్యార్హతలు ఉన్న వారిని విదేశాల నుంచి వచ్చే వారిని హెచ్ 1 బి వీసాల ప్రాతిపదికన తీసుకోవాలని ఆలోచిస్తున్నాయి.