Wednesday, January 22, 2025

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

 

Nifty50

ముంబయి: స్టాక్‌మార్కెట్ సోమవారం హెచ్చుతగ్గులతో నడిచింది. బెంచ్‌మార్క్ సూచీలు ఇంట్రాడే లాభాలను తుడిచేసి, చివరికి కాస్త నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37.78 పాయింట్లు(0.07%) కోల్పోయి 54,288.61 వద్ద, నిఫ్టీ 51.50 పాయింట్లు(0.32%) కోల్పోయి 16,214.70 వద్ద ముగిశాయి. దాదాపు 1390 షేర్లు లాభపడగా, 1932 షేర్లు నష్టపోయాయి. కాగా 158 షేర్లు ఎలాంటి మార్పులేకుండా ముగిశాయి.

నిఫ్టీలో ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టూబ్రో టాప్ గెయినర్లు కాగా, జెఎస్‌డబ్లు స్టీల్, టాటా స్టీల్, దివీస్ లాబ్స్, ఓఎన్‌జిసి, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయాయి. సెక్టార్‌వైజ్‌గా చూసినప్పుడు ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఐటి ఇండైసెస్ 0.51 శాతం మేరకు లాభపడ్డాయి. కాగా మెటల్ ఇండెక్స్ 8 శాతం నష్టపోయింది. రియల్టీ, ఫార్మ, ఆయిల్‌అండ్ గ్యాస్ ఇండెక్స్ 1శాతం మేరకు నష్టపోయాయి. ఇదిలావుండగా బిఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండైస్‌లు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడే మధ్యాహ్నం ట్రేడింగ్‌లో ఉదయపు లాభాలను మార్కెట్ కోల్పోయింది. స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించడంతో మార్కెట్ మళ్లీ కోలుకోనేలేదు. మెటల్ ఇండెక్స్ దాదాపు 9శాతం మేరకు ట్రేడింగ్‌లో పడిపోయింది. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల మనస్సులో ఇంకా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిణామాల భావాలు కొనసాగడం, ద్రవ్యోల్బణం ఒత్తిడి ఉండడంతో మార్కెట్ చివరికి నష్టాల్లోనే ముగిసింది. ద్రవ్యోల్బణంను అదుపుచేసేందుకు భారత ప్రభుత్వం ఇంధనంపై పన్నులు తగ్గించడం కూడా మార్కెట్ ముందుకు వచ్చింది.

ఇదిలావుండగా డాలరు మారకంతో పోల్చినప్పుడు భారత రూపాయి విలువ 77.52 వద్ద ఎలాంటి మార్పు లేకుండా ఫ్లాట్‌గా ముగిసింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన అమర రాజా బ్యాటరీస్ నికర లాభం రూ. 99 కోట్లకు అంటే 48 శాతంకు పడిపోవడంతో దాని షేరు ధర 6 శాతం పతనమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News