Monday, December 23, 2024

మార్కెట్లలో కుప్పలుతెప్పలుగా చైనా సరకులు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

అలీగఢ్ : దేశంలో బడా కార్పొరేట్ సంస్థలతో అనుసంధానమైన వర్తకులు చైనా సరకులను కుప్పలు తెప్పలుగా మార్కెట్లలోకి తెస్తున్నందున దేశీయ, లఘు, కుటీర పరిశ్రమలు, వృత్తి నిపుణులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు. తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మొరాదాబాద్ నుంచి సంభాల్ మీదుగా అలీగఢ్ చేరిన తరువాత రాహుల్ జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

అలీగఢ్‌లో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కార్యకర్తలు, ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షం సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) మద్దతుదారులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వస్తుండడంతో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ హిందీలో ‘ఎక్స్’ పోస్ట్‌లో ‘జన్‌నాయక్, లోక్ నేత్రితో భారత్ జోడో న్యాయ్ యాత్ర’ సమైక్యత, సహోదరభావం, సామరస్య సందేశంతో ముందుకు సాగుతోందని తెలియజేసింది. పార్టీ యాత్ర వీడియోను పంచుకుంటూ, ‘ఒక నియంత దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలనే పట్టుదలతో ఉన్నప్పుడు ఈ యాత్ర ద్వారా ఆయనను నిలువరించేందుకు యత్నించాం అనే సందేశాన్ని జనం పంపుతారు’ అని తెలిపింది.

రాహుల్ గాంధీ అలీగఢ్‌లోని ప్రముఖ తాళాల పరిశ్రమ, వృత్తినిపుణుల గురించి ప్రస్తావిస్తూ, చైనాలో తయారైన చౌక సరకులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడడం స్థానిక లఘు, కుటీర పరిశ్రమలను చావు దెబ్బ తీస్తున్నదని, అదే సమయంలో బడా వాణిజ్య సంస్థలు భారీగా ఆర్జిస్తున్నాయని ఆరోపించారు. ‘దేశంలో విద్వేషం పెరుగుతుండడానికి కారణం అన్యాయమే. భారత్‌లో నిరుపేదలు, రైతులు, యువజనులు, మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగానే మేము ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించాం’ అని రాహుల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News