Thursday, January 23, 2025

మర్రి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నాగర్ కర్నూల్ ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్ రెడ్డికి కోర్టులో భారీ ఊరట దక్కింది. మర్రి జనార్ధన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి మర్రి జనార్ధన్ రెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ సమయంలో ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్‌ను మర్రి జనార్ధన్ రెడ్డి సమర్పించారని నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు నాగం జనార్ధన్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించినట్టుగా ఆధారాలు సమర్పించలేదని ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి నాగం జనార్ధన్ రెడ్డి తనయుడు శశిధర్ రెడ్డి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి నాగం జనార్థన్ రెడ్డి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి నాగం జనార్ధన్ రెడ్డి పోటీ చేసే నాటికి ఆయన నాగర్ కర్నూల్ ఎంఎల్‌ఎగా ఉన్నాడు. 2009లో ఆయన ఇదే స్థానం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో టిడిపికి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ గా ఆయన నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు నాగం జనార్ధన్ రెడ్డి బిజెపిలో చేరారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి జనార్ధన్ రెడ్డి, నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన తనయుడు శశిధర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి నాగం జనార్ధన్ రెడ్డి తొలిసారిగా టిడిపి అభ్యర్ధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టారు.1989లో నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. 1994 నుండి 2009 వరకు టిడిపి అభ్యర్ధిగా ఇదే స్థానం నుండి ఆయన ప్రాతినిథ్యం వహించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నాగం జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి బిఆర్‌ఎస్ అభ్యర్ధి మర్రి జనార్ధన్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News