బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎపై రేవంత్ రెడ్డి మండిపాటు
మన తెలంగాణ / హైదరాబాద్ : నాగర్ కర్నూల్ ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్ రెడ్డిపై తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో బోనం ఎత్తితే, బతుకమ్మతో ఎదురొస్తే డబ్బులిస్తామని చాటింపు వేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. “బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవమని, తెలంగాణ సంస్కృతికి సంకేతమని, అలాంటి ఆత్మగౌరవానికి వెలకట్టడం బిఆర్‌ఎస్ నేతల అహంకారానికి పరాకాష్ఠ అని, తెలంగాణ సంస్కృతికి విధ్వంసమని బిఆర్‌ఎస్ పతనానికి సంకేతం’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ మేరకు గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న వీడియోను, ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తనను కెలకొద్దని, తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ వాళ్లను కాల్చిపడేస్తానని ఇటీవల ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన క్యాడర్ తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. ఆయన పాదయాత్ర చేయాల్సిన గ్రామాల్లో ముందురోజు చాటింపు వేయిస్తున్నారు. “మర్రి జనార్దన్ రెడ్డి మూడింటికి మన ఊర్లోకి వస్తున్నారు. బోనం ఎత్తుకుని వస్తే రూ.300, బతుకమ్మతో వస్తే రూ.200, ఎవరైనా డ్యాన్స్ చేస్తే ఒక ఫుల్ బీర్ ఇస్తారు’’ అని చాటింపు వేయించారన్నారు.