Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌ను వీడేదే లేదు: మర్రి జనార్దన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రెండు రోజులుగా జరగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, బిఆర్‌ఎస్‌ను వీడేదే లేదని నాగర్‌కర్నూల్ మాజీ ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా కొందరు పని గట్టుకుని తాను మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసి ఆ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవి వదంతులు మాత్రమేనని, తాను ఇప్పటివరకు ఏ పార్టీని కూడా సంప్రదించలేదన్నారు. కొన్ని పార్టీలు తనను మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయమని కోరిన మాట వాస్తవేమని, తమ పార్టీ బిఆర్‌ఎస్ కూడా ఈ స్థానాల నుంచి పోటీ చేయమని తన వద్దకు ప్రస్తావన తీసుకువచ్చిందని అన్నారు. అయినా తాను ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినంత మాత్రాన నెల రోజుల్లో తాను వేరే పార్టీ మారావాల్సిన అవసరం లేదన్నారు.

తన దైవం, తన తండ్రి సమానమైన నాయకుడు సర్వం కెసిఆర్ అని అన్నారు. తాను పార్టీ వీడేది ఉన్నా.. ఎంపిగా నిలబడాలని భావించినా నేరుగా పార్టీ అధినేతతో మాట్లాడి, నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటాను తప్ప అల్లాటప్పాగా నిర్ణయాలు తీసుకోనని అన్నారు. తనను అప్రతిష్టపాలు చేయడానికే ఫలానా పార్టీకి ఫండ్ ఇస్తున్నానని ప్రచారం చేస్తున్నారని, తాను ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చిన వాడినని, నియోజకవర్గంలో మరో రెండు పాఠశాలలు, పేద ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తానే తప్ప పేద పిల్లల చదువులు, వైద్యం, సామాజిక సేవకోసం ముందుంటానే తప్ప పార్టీలకు ఫండ్ ఇవ్వడానికి ఎప్పుడూ తాను ముందుకు రానన్నారు. తాను ఫలానా పార్టీ నాయకులను కలిసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, నాగం శశిధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News