Monday, December 23, 2024

టార్గెట్ ఠాగూర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ టార్గెట్‌గా కొందరు సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత అనైక్య పరిస్థితికి మాణికం ఠాగూర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలే కారణమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌ని పిసిసి అధ్యక్షుడిగా చేయడంలో మాణికం ఠాగూర్ కీలక పాత్ర పోషించారనేది కూడా సీనియర్ల ప్రధాన ఆరోపణ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నట్టు ప్రకటించడంతో అది సీనియర్లకు అందివచ్చిన అవకాశం గా పరిణమించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అటు రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ నోటికొచ్చినట్టు మాట్లాడటం సీనియర్లకు కలిసొచ్చిన అంశంగా మారింది.

సరిగ్గా ఇదే సమయంలో మర్రి శశిధర్ రెడ్డి బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేయడం, తనపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిందేనని మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టుబట్టడంతో పార్టీలో పరిస్థితులు అదుపు తప్పేస్థాయికి చేరుకుంటున్నాయి. అంతేకాదు, సీనియర్లందరినీ కూడగట్టే ప్రయత్నంలో ఆయన నిమగ్నమయ్యారు. ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్ మెంట్‌ను మర్రి శశిధర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అవకతవకలన్నీ ఆమెకు వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధిష్టానానికి మాణికం ఠాగూర్, రేవంత్‌రెడ్డిలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని సీనియర్ల ప్రధాన ఆరోపణగా ఉంది. అందరినీ సమన్వయం చేసి పార్టీని ముందుకు సాగేలా దిశా నిర్దేశం చేయల్సిన మాణికం ఠాగూర్ రేవంత్‌తో చేతులు కలిపాడని తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. కాగా, కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదని మర్రి శశిధర్‌రెడ్డి బాహాటంగానే తన అసంతృప్తిని కనబర్చారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందారు. తన 40 ఏళ్ల జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని మర్రి శశిధర్‌రెడ్డి ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా, ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రచారాన్ని మహేశ్వరరెడ్డి ఖండించారు. మర్రి శశిధరరెడ్డి కాంగ్రెస్ మనిషేనని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఇలాంటివి సహజమేనని పేర్కొంటూనే రేవంత్ సర్దుకు పోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించడం గమనార్హం. ఖమ్మంలో తనను ఎదురించేవారే లేరని రేణుక ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎర్ర శేఖర్‌పై అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్
రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పార్టీ అదిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే పార్టీలో పలువురు నేతల మధ్య పంచాయితీలు కొనసాగుతుండగా తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంఎల్‌ఎ ఎర్ర శేఖర్ తీరును జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ అనిరుధ్ రెడ్డి తప్పుబట్టారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్‌కు అనిరుధ్‌రెడ్డి లేఖ రాశారు. ఎర్ర శేఖర్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనిరుధ్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఆయన పార్టీలో చేరినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు ఉండటం లేదని ఆరోపించారు.

Marri Shashidhar Reddy comments on Manickam Tagore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News