Wednesday, March 26, 2025

వివాహం భర్తకు భార్యపై యాజమాన్య హక్కు ఇవ్వదు:అలహాబాద్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

వివాహం చేసుకున్నంత మాత్రాన భార్య కట్టుబానిస కాదు. వివాహం ఆమెపై భర్తకు యాజమాన్యం హక్కు ఇవ్వదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య సమ్మతి లేకుండా తాను, ఆమె సన్నిహితంగా ఉన్న వీడియోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. అలాంటి విడియో అప్ లోడ్ చేసిన వ్యక్తిపై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. వివాహం అన్నది పవిత్రమైన సంబంధం. నమ్మకం ఆ బంధానికి పునాది.. ఆ నమ్మకాన్ని ఉల్లంఘించడం వైవాహిక బంధాన్నిదెబ్బతిస్తుంది అని ధర్మాసనం పేర్కొంది. వివాహం భర్తకు భార్యపై యాజమాన్యం లేదా నియంత్రణ హక్కు ఇవ్వదని స్పష్టం చేసింది.

వివాహం చేసుకున్న వ్యక్తి గోప్యతా హక్కును ఉల్లంఘించకూడదని న్యాయమూర్తి పేర్కొన్నారు. చార్జిషీటును రద్దుచేయాలని దాఖలు చేసిన దరఖాస్తునుజస్టిస్ వినోద్ దివాకర్ తొసిపుచ్చారు. ఫేస్ బుక్ లో సన్నిహిత వీడియో అప్ లోడ్ చేయడం ద్వారా ఆ వ్యక్తి వైవాహిక బంధం పవిత్రతను తీవ్రంగా ఉల్లంఘించాడన్నారు. భార్య స్వంత హక్కులు, కోరికలు, స్వతంత్రత కలిగిన వ్యక్తి .ఆమె శారీరక, స్వయంప్రతిపత్తి, గోప్యత గౌరవించడం భర్త నైతిక బాధ్యత అని న్యాయమూర్తి పేర్కొన్నారు. మీర్జాపూర్ లో ప్రద్యుమ్న్ యాదవ్ అనే వ్యక్తి పై ఐటీ చట్టం సెక్షన్ 67 కింద భార్య కేసుపెట్టింది. తనకు తెలియకుండా తాను అతడితో కలిసిఉన్న వీడియోను ఫోన్ లో చిత్రీకరించి ఫేస్ బుక్ లో పెట్టాడని, తన బంధువులకు, గ్రామస్తులకు షేర్ చేశాడని ఆమె ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News