Sunday, December 22, 2024

పెళ్లయినా కూతురు కూతురే…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పెళ్లయినా కూతురు కూతురే అని, ఆమెకు తల్లిదండ్రుల ద్వారా అందే సౌకర్యాలు అందాల్సిందే అని కర్నాటక హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లయిన కొడుకును కొడుకుగా భావిస్తున్నట్లే, వివాహిత అయిన కూతురును కూడా కూతురుగానే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక సైనిక సంక్షేమ మండలి వెలువరించిన మార్గదర్శకాలలో వివాహిత కూతురు మాజీ సైనికోద్యోగులకు అందే డిపెండెంట్ కార్డులను వాడుకోవడానికి వీల్లేదని పేర్కొనడం వివాదాస్పదం అయింది.

ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇటీవల కూతురు కొడుకు మధ్య వివక్ష చూపరాదని తెలిపింది. పెళ్లి అయిందా? లేదా అనేది చూడకుండా కొడుకును కొడుకుగా చూసుకుంటూ తల్లిదండ్రుల నుంచి అందే ప్రయోజనాలను వారికి వర్తింపచేస్తుప్పుడు, కూతురును కూతురిగా పరిగణనలోకి తీసుకుని ఆమె పెళ్లితో సంబంధం లేకుండా వారసత్వ ప్రయోజనాలు ఆమెకు ఎందుకు దక్కరాదు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

పెళ్లితో కొడుకు హోదా మారనప్పుడు, ఇదే పెళ్లితో కూతురు హోదా ఎందుకు మారుతుంది? ఆమె పరాయి అయిపోతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. సైనిక మాజీ సుబేదార్ రమేషన్ కందప్ప 31 ఏండ్ల కూతురు ప్రియాంక పాటిల్ తనకు తండ్రి ద్వారా ప్రయోజనం పొందే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఎం నాగప్రసన్న తమ తీర్పు వెలువరించారు.

2001లో ఆపరేషన్ పరాక్రమ్‌లో భాగంగా మందుపాతరల ఏరివేత దశలో సుబేదార్ అమరులు అయ్యారు. మాజీ సైనిక కుటుంబం వ్యక్తిగా తనకు గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదని, పెళ్లి అయినందున ఈ అవకాశం లేదని సైనిక సంక్షేమ మండలి తమ మార్గదర్శకాలను ప్రస్తావించడంతో దీనికి వ్యతిరేకంగా ప్రియాంక పాటిల్ కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మాజీ సైనికుల పిల్లలకు పది శాతం కోటాను కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు తనకు ఈ రిజర్వేషన్ కల్పించాలని ఆమె కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News