Wednesday, January 22, 2025

నాకు పెళ్లయి 45 ఏళ్లయింది..కోపం రాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిత్యం ఆందోళనల నడుమ కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గురువారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ల మధ్య సంవాదం సభలో నవ్వులు పూయించింది.మణిపూర్ అంశంపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలని ఖర్గే చైర్మన్‌ను గురువారం మరోసారి డిమాండ్ చేశారు. ఈ రూల్ కింద చర్చ చేపడితే సంబంధిత అంశంపై ఎక్కువ సమయం చర్చించడానికి వీలుంటుందని ఆయన అన్నారు. అయితే దీనిపై చైర్మన్ స్పందిస్తూ రూల్ 176 ప్రకారం స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకుప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఇదే కారణంగా గత కొన్ని రోజులుగా ఎగువ సభలో కార్యకలాపాలు నిలిచిపోతున్నాయని ధన్‌కర్ గుర్తు చేశారు. చైర్మన్ సమాధానంపై తీవ్ర అభ్యంతరం తెలియజేసిన ఖర్గే.. ప్రతి రోజూ ఇదే సమాధానం చెబుతున్నారని..

దీనిపై నిన్న కూడా అడిగితే కోపగించుకున్నారని అన్నారు. దీంతో సభ్యులు నవ్వులు అందుకున్నారు. చైర్మన్ చిరునవ్వు నవ్వుతూ ‘ నాకు 45 ఏళ్ల క్రితమే పెళ్లయింది.. కోపం నాకెందుకు వస్తుంది’ అని బదులిచ్చారు. దీంతో సభలో మరోసారి నవ్వులు పూశాయి.ఆ తర్వాత ధన్‌కర్ సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు పి. చిదంబరాన్ని ఉద్దేశిస్తూ..‘ చిదంబరం ఓ విశిష్టమైన న్యాయవాది.సీనియర్ అడ్వకేట్ ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. వాళ్లు అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేయలేరు. మీరు మా అధిష్ఠానం సర్’ అంటూ సరదాగా సమాధానమిచ్చారు. దీంతో అధికార,విపక్ష సభ్యులంతా మరోసారి ఫక్కుమన్నారు. తన వ్యాఖ్యల్లో ఏమయినా తప్పుందా? అని ఖర్గేనుధన్‌కర్ ప్రశ్నించగా, ‘ ‘మీరు కోపాన్ని ప్రదర్శించరు. కానీ లోలోపల దాచుకుంటారు’అని ఖర్గే అన్నారు.

దీంతో చైర్మన్ సహా అందరూ సరదాగా నవ్వుకున్నారు. ఈ సరదా సన్నివేశం తర్వాత కూడా ఖర్గే తన వాదనను కొనసాగించారు. రూల్ 267 కింద చర్చ ఎందుకు చేపట్టడం లేదో చెప్పాలన్నారు.దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఈ రూల్ కింద చర్చ చేపట్టడానికి ఏ కారణం లేదన్నారు. కేవలం మొండివైఖరితోనే ప్రతిపక్షాలు రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి తప్ప అంతకు మించి ఏమీ లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News