Monday, December 23, 2024

పెళ్లి కావల్సిన జంటకు హోటల్ తుది మజిలీ..

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎన్నారై జంటకు ముంబై హోటల్ చివరికి చితిపేర్చింది. ముంబైలోని గెలాక్సీ హోటల్‌లో ఆదివారం చెలరేగిన మంటల్లో ఇక్కడ బసచేసిన ఎన్నారై కిషన్ హలాయ్ , ఆయన పాతికేండ్ల ప్రియురాలు రూపాల్ వెకారియా సజీవదహనం చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఆహూతి అయ్యారు. వీరి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. విధి విచిత్రరీతిలో వీరిని ఈ హోటల్‌కు చేర్చింది. ఇక్కడ ఆదివారం బసచేసేలా చేసింది. ప్రేమించుకున్న వీరు తాము చాలా కాలంగా నివాసం ఉంటున్న నైరోబీకి వెళ్లాల్సింది. అయితే విమాన ప్రయాణాల షెడ్యూల్ మారడంతో వీరు ఈ హోటల్‌లో ఉండాల్సి వచ్చింది. కిషన్ , రూపాల్ ఆమె తల్లి, సోదరి అంతా కూడా శాంతాక్రజ్‌లోని ఈ హోటల్‌లో బసకు దిగారు. కిషన్‌ది గుజరాత్‌లోని కచ్ జిల్లా మాండ్వీ తాలూకాలోని రాంపూర్ గ్రామం. ఇరు కుటుంబాల వారు కిషన్ ప్రేమ పెళ్లికి అంగీకరించారు. ముంబై నుంచి నైరోబీకి వెళ్లేందుకు ముంబైకి వచ్చిన వీరు చివరికి పెళ్లి కలకాగా,జంటగా మంటల్లో కలిసిపోవడం విషాదకరం అయింది.

ఘటనలో వీరిద్దరు, 50 ఏండ్ల వ్యక్తి కాంతీలాల్ వారా సజీవదహనం అయ్యారు. కాగా రూపాల్ తల్లి మంజులాబెన్, సోదరి అల్పా, మరో వ్యక్తి అస్లామ్ షేక్ గాయపడ్డారు. కిషన్ హలాయ్ ఆయన ఫియాన్సీ రూపాల్ వెకారియా చాలా కాలంగా నైరోబీలో ఉంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామని తమకు చివరి దశలో చెప్పారని రాంపూర్ గ్రామ సర్పంచ్ సురేష్ కారా తెలిపారు. కిషన్ , రూపాల్‌ల కుటుంబాలు చాలాకాలంగా నైరోబీలో ఉంటూ ఉన్నా, వీరు అప్పుడప్పుడు గ్రామానికి వచ్చిపోతూ ఉంటారని, వారి పూర్వీకుల ఇళ్లు గ్రామంలో ఉన్నాయని సర్పంచ్ చెప్పారు. కుటుంబాలతో పాటు వీరు నైరోబీలో ఉంటూ వస్తున్నారు. నెలరోజుల క్రితం ఇక్కడికి వచ్చారని , గ్రామంలో జరిగిన కిషన్ తమ్ముడి పెళ్లికి హాజరయ్యారని తెలిపారు. కిషన్ తాత నాయనమ్మ గ్రామంలోనే ఉంటారు. కిషన్ ఈ గ్రామంలోనే పుట్టారు. కాగా రూపాల్ నైరోబీలో జన్మించింది. శనివారమే వీరి కుటుంబం నైరోబీకి వెళ్లాల్సి ఉంది. దీనికి ముందు వీరు సరదాగా ముంబై కలియతిరిగారు.

పెళ్లి షాపింగ్ చేశారు. ఇక విమాన ప్రయాణంలో మార్పు జరిగినట్లు వీరికి సమాచారం అందింది. దీనితో వీరిని ఎయిర్‌లైన్స్ వారు ఈ హోటల్‌లో ఉంచారు. మధ్యాహ్నం ఈ హోటల్‌లో మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లో వీరు ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పుడు వీరి కాలిన భౌతికకాయాలే మిగిలాయని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనేది కుటుంబ సభ్యులు నిర్ణయిస్తారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News