హైదరాబాద్: పిల్లలు కలగడంలేదని వేధింపులకు గురిచేయడంతో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ఎల్‌బి నగర్‌కు చెందిన తిరుమల్ గౌడ్, సావిత్రిల కుమారుడు సురేష్, కామారెడ్డికి చెందిన ఉదయశ్రీకి పదేళ్ల క్రితం వివాహమైంది. పిజి వరకు చదువుకున్న ఉదయశ్రీ నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త సురేష్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం జరిగి పదేళ్లు అవుతున్నా వీరికి పిల్లలు పుట్టలేదు. సంతానం కలగకపోవడంతో భార్య, భర్త మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్తతోపాటు అత్తామామలు కూడా వేధింపులకు గురిచేస్తున్నారు.
మానసికంగా తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో తట్టుకునేది కాదు. ఈ క్రమంలో ఉదయశ్రీ భర్త సురేష్ మార్కెటింగ్ విధులకు వెళ్లాడు. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చాడు. తలుపు కొట్టగా ఎంత సేపైనా తీయలేదు. అనుమానం వచ్చి వెంటనే సురేష్ డయల్ 100కు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఉదయశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఉదయశ్రీ భర్త సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంది…
తమ అక్క భర్త, అత్తామామ, ఆడపడుచుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి సోదరుడు రంజిత్‌గౌడ్ ఆరోపించారు. చైతన్యపురిలో సొంతఇల్లు ఉన్నా హడావుడిగా సరూర్‌నగర్‌లో అద్దె ఇల్లు తీసుకుని ఎందుకు ఉంటున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే మా అక్క ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మా అక్కను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అన్నాడు. కేసును పక్కదోవ పట్టించేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.