ముంబై: ఇంటిపని చేయమని వివాహితను అత్తింటి వారు అడిగారంటే ఆమెను పనిమనిషిగా చూస్తున్నారని అర్ధం కాదని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విభకంకన్‌వాడి, జస్టిస్ రాజేష్ పటేల్ తో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. పెళ్లయిన తరువాత ఇంటిపనిచేయడం ఆమెకు ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని ముందే తెలియజేస్తే వివాహ విషయంలో పునరాలోచనకు అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది. పెళ్లయిన నెల రోజుల తరువాత నుంచి తనను పనిమనిషిగా చూస్తున్నారని భర్త, అత్త, వదినపై ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహితను ఇంటిపని చేయాలని కోరారంటే అది కచ్చితంగా కుటుంబం కోసమేనని, అంతేకాని పనిమనిషిగా చూస్తున్నారని అనడం మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
నిందితుడు కారు కొనుగోలు చేసేందుకు తమను రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, పిటిషన్‌దారైన వివాహిత ఆరోపించింది. అంతడబ్బు తమ వద్ద లేదని తన తండ్రి చెప్పడంతో తనను మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించింది. కొడుకును కనాలని, అత్త వదిన తనను చిత్రహింసలు పెట్టారని ఆమె ఆరోపించింది. అయితే బ్యాంకు రుణం ద్వారా అతడు కారు కొనుక్కున్నాడని, ఆమెను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని నిందితుల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే పిటిషన్‌దారైన ఈ మహిళ తన మొదటి వివాహానికి సంబంధించి కూడా ఇదే విధమైన ఫిర్యాదులు చేసిందని కోర్టుకు నివేదించారు. దీంతో నిందితులపై మహిళ చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంటూ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
Married Woman doing household work for family not Cruelty