కరాచి : పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో మతమార్పిడికి ఒప్పుకోని హిందూ వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఉమర్‌కోట్ జిల్లా లోని సమరో పట్టణంలో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు కాలేదు. బాధితురాలు తనపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పినా ఆదివారం వరకు మిర్‌పుర్‌ఖాస్ పోలీసులు కేసు నమోదు చేయడంలో విఫలమయ్యారని స్థానిక హిందూ నేత ఒకరు విమర్శించారు. బాధితురాలితోపాటు ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ బయటే కూర్చున్నా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు.
తనను ఇస్లాం లోకి మారాలంటూ ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో, వారి సహచరులు బెదిరించారని , ఒప్పుకోకపోయే సరికి కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు అత్యాచారం చేసినట్టు బాధితురాలు వాపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకోగలిగానని బాధితురాలు చెప్పింది. సింధ్ ప్రావిన్స్‌లోని శివారు ప్రాంతాల్లో హిందూ యువతులు, మహిళల్ని కిడ్నాప్ చేయడం, బలవంతంగా మతమార్పిడి చేయించడం పెద్ద సమస్యగా మారింది. హిందువులు అత్యధికంగా ఉండే ప్రాంతాలైన థార్, ఉమర్‌కోట్, మిర్‌పుర్‌ఖాస్, ఘోట్కి, ఖైరాపూర్ వంటి చోట్ల ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.