Sunday, January 19, 2025

NASA: అంగారకునిపై రికార్డుల సాధనలో నాసా ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్

- Advertisement -
- Advertisement -

గత రెండేళ్లుగా అంగారక గ్రహంపై నాసాకు చెందిన ఇన్‌జెన్యుటీ (ingenuity) అనే హెలికాప్టర్ ఎగురుతోందన్న సంగతి తెలిసిందే. ఆ గ్రహంపై ఉన్న ప్రతికూల వాతావరణంలో మీదకు ఎగరడం, వేగంగా ప్రయాణించడంలో ఇన్‌జెన్యుటీ రికార్డులు సృష్టిస్తోంది. సోలార్‌పవర్ తో పనిచేసే ఈ హెలికాప్టర్ అంగారక గ్రహంపై 2021 ఫిబ్రవరి 18న కాలుమోపింది. అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టడానికి పెర్సవరెన్స్ రోవర్ అనే రోదసీ నౌకను నాసా పంపిన విషయం తెలిసిందే.

పెర్సవరెన్స్ రోవర్ ప్రాజెక్టులో భాగంగా ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్‌ను కూడా నాసా పంపింది. రోవర్ కింది భాగంలో ఈ హెలికాప్టర్‌ను అమర్చారు. రోవర్ ఉదర భాగం నుంచి ఈ హెలికాప్టర్ అంగారక ఉపరితలం పైకి దిగింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసినా, మొదటిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను వినియోగించడం ఇదే మొదటిసారి. అంగారకుడిపై పగటి ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల వరకు పెరుగుతుంటాయి. రాత్రుళ్లు మైనస్ 90 డిగ్రీల వరకు పడిపోతుంటాయి.

భూమి సాంద్రతలో కేవలం 1 శాతం మాత్రమే ఉన్న అంగారక గ్రహంపై ఈ హెలికాప్టర్ ఎగరడం కష్టసాధ్యమే. అదే సమయంలో భూమి గురుత్వాకర్షణ శక్తిలో మూడోవంతు మాత్రమే అంగారక గ్రహంపై గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అదే ఇది ఎగరడానికి సాయం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ రెండేళ్లలో ఈ హెలికాప్టర్ 11 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించ గలిగింది. భూమితో పోలిస్తే ఇలా ప్రయాణించడం అంత సులువుకాదు. వాస్తవానికి హెలికాప్టర్ ఇన్‌జెన్యుటీ వరల్డ్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇన్‌జెన్యుటీ అంగారక గ్రహంపై ఈఏప్రిల్ 2 (2023) ఆదివారం 49 వ సారి ఎగిరింది. ఈ విధంగా రెండు రికార్డులు బద్దలు కొట్టింది.

ఒకటి ఎక్కువ ఎత్తుకు ఎగరడం. రెండు అత్యంత వేగంతో ప్రయాణించడం. ఈ విధంగా భూమికి బయట వేరే గ్రహంపై స్వయం చోదకంగా సాధించడం చరిత్ర సృష్టించడమే. ఇప్పుడు 16 మీటర్లు ఎత్తులో గంటకు 33.4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, గత రికార్డును అధిగమించింది. 2022 డిసెంబర్ 3 న 14 మీటర్ల ఎత్తులో గంటకు 19.8 కిలోమీటర్ల వంతున ప్రయాణించింది. ఇలా డిసెంబర్ 10,జూన్ 11,ఏప్రిల్ 8 తో కలిపి మూడుసార్లు ప్రయాణించింది. 2022 ఏప్రిల్ 8న 25 వసారి ఎగిరినప్పుడు ఈ సుదీర్ఘ హెలికాప్టర్ మొత్తం 704 మీటర్ల దూరం ప్రయాణించింది.

భూమి మీద నివసిస్తున్న మనకు ఇది చాలా చిన్నపాటి దూరంగా కనిపించవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. అంగారక గ్రహం మనకు 225 మిలియన్ కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు గ్రహాల మధ్య దూరం అంటే సిగ్నల్ నుంచి ప్రయాణం మొదలు పెట్టి ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లాలంటే ఐదు నుంచి 20 నిమిషాలు పడుతుంది. సిగ్నల్ ఆలస్యంతోపాటు గ్రహంపైన అసాధారణ కఠిన మైన వాతావరణ పరిస్థితుల్లో ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్ మనుగడ సాగించవలసి వస్తోంది. అక్కడ పైకి హెలికాప్టర్ లేవడమంటే ఎంతో కష్టం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News