ఖమ్మం: పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తుందని, రాజ్యాల ఏర్పాటు తర్వాత ప్రజావసరాల కోసం, రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని మంచిర్యాల డిసిపి ఉదయ కుమార్ రెడ్డి తెలిపారు. రామగుండం కమిషనరేట్ బెల్లంపల్లి ఆర్ముడ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటుచేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మంచిర్యాల డిసిపి ఉదయ కుమార్ రెడ్డి, మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్ ఐ.పి.ఎస్ పోలిస్ గౌరవందనం తీసుకుని అమరవీరుల స్థూపము వద్ద పుష్పగుచ్ఛము ఉంచి నివాళులు అర్పించారు.
అనంతరం డిసిపి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశంలో అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తున్నదని కొనియాడారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రజా రక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం అజరామరంగా నిలిచిపోతుందని మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. 1959 అక్టోబర్ 21వ తేదీన సిఆర్ పిఎఫ్ ఎస్ఐ కరమ్ సింగ్ నాయకత్వం లోని భారత జవాన్లు ఈశాన్య లడక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని, వీరి ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నట్లు తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు, ఆర్మీ శాఖలకు చెందిన 377 మంది అధికారులు వివిధ సంఘటనలలో ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి, దేశ రక్షణ కోసం అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. ఫ్లాగ్ డే సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుండి 31 వరకు జిల్లాలో పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, ఆయుధాల పట్ల విద్యార్థులకు అవగహన కోసం ఆన్లైన్ ఓపెన్ హౌస్, జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు వీటిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎసిపి సిఎఆర్ బెల్లంపల్లి సిహెచ్ మల్లిఖార్జున్, సిఐ టౌన్ బెల్లంపల్లి రాజు, సిఐ బెల్లంపల్లి రూరల్ జగదీశ్, ఆర్ఐ (అడ్మిన్ ) జె అనీల్ కుమార్ సిఎఆర్ బెల్లంపల్లి, ఆర్ఐ (ఎంటిఒ) కె అంజన్న బెల్లంపల్లి, ఎస్ ఐ లు బెల్లంపల్లి టౌన్, ఎస్ఐ తాళ్ళ గురిజాల, సిఎఆర్ హెడ్ క్వార్టస్ సాయుధ దళ సిబ్బంది పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిడం జరిగింది.