Monday, December 23, 2024

పాక్ పంజాబ్ సిఎంగా నవాజ్ కుమార్తె మరియం

- Advertisement -
- Advertisement -

లాహోర్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్=నవాజ్ (పిఎంఎల్=ఎన్) సీనియర్ నాయకురాలు, మూడు సార్లు ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పాకిస్తాన్‌లో ఒక ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దేశంలో ప్రతి మహిళకు ఇది ‘గర్వకారణం’ అని ఆమె పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు ఉన్న సున్నీ ఇత్తేహాద్ కౌన్సిల్ (ఎస్‌ఐసి) శాసనసభ్యుల వాకౌట్ మధ్య ముఖ్యమంత్రి ఎన్నికలలో పిఎంఎల్-ఎన్ సీనియర్ ఉపాధ్యక్షురాలు 50 ఏళ్ల మరియం నవాజ్ గెలుపొందారు. ప్రొవిన్షియల్ శాసనసభలో తన తొలి ప్రసంగంలో మరియం భగవంతునికి, తన తండ్రి నవాజ్ షరీఫ్‌కు, బాబాయి షెహ్‌బాజ్ షరీఫ్‌కు, తనకు వోటు వేసిన శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన తండ్రి కూర్చుంటుండే స్థానంలో ఆసీనురాలు అయినందుకు తాను సంతోషిస్తున్నానని మరియం తెలిపారు.

‘పదవీ బాధ్యతల నిర్వహణ ఏవిధంగానో నా తండ్రి నాకు నేర్పారు’ అని నవాజ్ షరీఫ్‌కు రాజకీయ వారసురాలిగా పరిగణిస్తున్న మరియం చెప్పారు. ‘ఇప్పుడు ఒక మహిళా ముఖ్యమంత్రిని చూస్తున్నందుకు ప్రావిన్స్‌లో ప్రతి మహిళ గర్విస్తుంటుంది’ అని ఆమె అన్నారు. మహిళా నాయకత్వ సంప్రదాయం మున్ముందు కూడా కొనసాగుతుందనే ఆశాభావాన్ని మరియం వ్యక్తం చేశారు. కారాగార శిక్ష వంటి కఠిన సమయాలను తాను చూసినట్లు ఆమె చెప్పారు. అయితే, తనను బలమైన నాయకురాలిని చేసినందుకు ప్రత్యర్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను కక్ష తీర్చుకోవాలని అనుకోవడం లేదు’ అని మరియం పాక్ సైనిక దళాల మాజీ అధిపతి జనరల్ కమర్ జావేద్ బజ్వా, పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సకీబ్ నిసార్‌లను పరోక్షంగా ప్రస్తావిస్తూ చెప్పారు. రాజకీయంగా కీలకమైన, 12 కోట్ల జనాభా ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి పదవికి నిర్వహించిన ఎన్నికలలో మరియం నవాజ్ 220 వోట్లతో గెలిచారు.

పిటిఐ మద్దతు ఉన్న ఎస్‌ఐసి అభ్యర్థి రాణా అఫ్తాబ్‌ను ఆమె ఓడించారు. ఎస్‌ఐసి ఎన్నికలను బహిష్కరించినందున ఆయనకు ఒక్క వోటూ రాలేదు. కొత్తగా ఎన్నికైన స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ సెషన్‌కు అధ్యక్షత వహిస్తూ, ‘వోట్లను లెక్కించడమైంది. మరియంకు 220 వోట్లు లభించాయి. ఎస్‌ఐసి అభ్యర్థి రాణా అఫ్తాబ్ అహ్మద్‌కు సున్నా వోట్లు వచ్చాయి’ అని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News