Thursday, November 21, 2024

నీట్‌లో మాస్ కాపీయింగ్.. సూత్రధారి సహా 8 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ఆదివారం జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో మోసానికి పాల్పడిన ఎనిమిది మందిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనుమానిత సూత్రధారితో పాటు పలువురిని అదుపు లోకి తీసుకున్నారు. నీట్ పరీక్షలో అసలైన అభ్యర్థులకు బదులుగా ఢిల్లీ, హర్యానాల్లో కొందరు వ్యక్తులు నేరపూరిత కుట్రకు పాల్పడుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఈ మాస్ రిగ్గింగ్ కుట్రను బట్టబయలు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నీట్ యూజీ పరీక్షల్లో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని అసలైన అభ్యర్థులకు బదులుగా వేరొకరితో పరీక్ష రాయాలని ప్రణాళికలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

పరీక్ష రాసేందుకు వీలుగా అభ్యర్థుల యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను నిందితులు సేకరించారని వారు కోరుకున్న పరీక్ష కేంద్రాలను పొందేందుకు అవసరమైన సవరణలూ చేసినట్టు సీబీఐ ఆరోపించింది. నకిలీ అభ్యర్థులతో రాయించేందుకు ఫోటోలను మార్ఫింగ్ చేయించారని తెలిపింది. ఈమేరకు సుశిల్ రంజన్, బ్రిజ్‌మోహన్ సింగ్, పప్పు, ఉమాశంకర్ గుప్తా, నిధి, కృష్ణ శంకర్ యోగి, సన్నీ రంజన్ , రఘునందన్ , జీపులాల్, హేమేంద్ర , భరత్ సింగ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.

అవమానకర ఘటనలు

ఇదిలా ఉంటే కొన్ని నీట్ పరీక్ష కేంద్రాల్లో తనిఖీల పేరుతో అవమానకర ఘటనలు చోటు చేసుకున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. డ్రెస్‌కోడ్ అని చెప్పి విద్యార్థినుల లోదుస్తులు విప్పించినట్టు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. కేరళ కొల్లాం లోని ఓ పరీక్ష కేంద్రంలో దాదాపు 100 మంది విద్యార్థినులను లోదుస్తులు విప్పేసి లోపలికి వెళ్లాలని అక్కడి సిబ్బంది ఆదేశించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయిలు ఆ నిబంధనను పాటించాల్సి వచ్చింది. పరీక్ష అనంతరం విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News