ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ వైపు భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకుంటుంది. దానికి ఉత్తమ ఉదాహరణ ‘డీజే టిల్లు’. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ స్థాయిలో అలరించడానికి సితార సంస్థ సిద్ధమవుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘వినోదంలో కథేముందో’ పాటకు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. యువత ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది. శనివారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకకు యువ సంచలనం, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విడుదలైన ‘బుట్ట బొమ్మ’ ట్రైలర్.. టైటిల్ కి తగ్గట్లే అందంగా, ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.
‘బుట్టబొమ్మ’ కథ అరకు ప్రాంతంలో జరుగుతుంది. అరకులోని అందమైన లొకేషన్లను చూపిస్తూ ట్రైలర్ ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. ఇందులో అనిఖా సురేంద్రన్ ఒక సాధారణ మధ్యతరగతి యువతిగా కనిపిస్తోంది. చిన్న చిన్న కోరికలు, కొన్ని బాధ్యతలు, వయసొచ్చిన ఆడపిల్ల ఉన్న తండ్రి పడే ఆందోళన మధ్య ఆమె పాత్ర పరిచయమైంది. అనుకోకుండా ఫోన్ ద్వారా ఆమెకు ఆటో డ్రైవర్(సూర్య వశిష్ఠ)తో పరిచయం కావడం, అది ప్రేమ వరకు వెళ్లడం జరుగుతుంది. అయితే ఎంతో హాయిగా సాగిపోతున్న వారి ప్రేమ కథలోకి అర్జున్ దాస్ పాత్ర రాకతో అలజడి మొదలవుతుంది.
నేర చరిత్ర, రాజకీయ పలుకుపడి ఉన్న అతను వీరి జీవితాల్లోకి ఎందుకు వచ్చాడు? అతని రాకతో ఈ ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తిని రేకెత్తించేలా రూపొందించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం, గోపి సుందర్ నేపథ్య సంగీతం ట్రైలర్ ను మరో మెట్టు ఎక్కించాయి. ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కగా కుదిరింది. గణేష్ రావూరి సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “ఈడొచ్చిన దానివి ఇంట్లో పడుండు.. ఎవడి కంట్లోనూ పడకు”, “21వ శతాబ్దంలో ప్రపంచం సంకనాకి పోద్దని బ్రహ్మంగారు చెప్పారు” వంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ వంశీ నిర్మాణంలో సినిమా చేద్దామని ఎదురుచూస్తున్న హీరోలలో నేను ఒకడిని అని అన్నారు. నిజానికి అసలు ఈ బుట్టబొమ్మ సినిమాలో నేను నటించాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేకపోయానని తెలిపారు.. ఇది తనకు చాలా ఇష్టమైన కథ. గుండెల మీద చేతులేసుకుని వచ్చేయొచ్చు ఈ సినిమాకి.. అంత బాగుంటుంది. నిర్మాత వంశీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అనిఖా, సూర్యలకు మొదటి సినిమాకే సితార బ్యానర్ లో వంశీ గారి నిర్మాణంలో నటించే అవకాశం రావడం అదృష్టమని అన్నారు.
గోపిసుందర్ గారు సంగీతం అందించారు. ‘మేజర్’ తర్వాత వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్ గా చేశారు. నవీన్ నూలి ఎడిటర్ గా చేశారు. కొత్త నటీనటుల సినిమాకి ఇంత పెద్ద టెక్నిషియన్స్ దొరకడం అదృష్టమని సూచించారు. వంశీ గారు ఇలాగే యువ ప్రతిభను ప్రోత్సహించాలని కోరుకుంటున్న అన్నారు. అలాగే వంశీ గారి నిర్మాణంలో నేను చేయబోయే సినిమాని కూడా త్వరలో ప్రకటిస్తామని, ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన అర్జున్ దాస్ కి అభిమానిని అని, అతని నటన, గొంతు చాలా ఇష్టమని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ఇది ఒక మంచి పల్లెటూరి కథ. ఐదేళ్ల క్రితం ఉయ్యాల జంపాల అనే సినిమా చూశాం. అలాంటి సినిమాలో సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది ఈ సినిమా. ఈ మధ్య చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి ఇలా ఎక్కువగా మాస్ సినిమాలు చూశాం. ఇప్పుడు క్లాస్ సినిమా చూస్తారు. సస్పెన్స్ తో కూడిన ఒక క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ ఇది. అలాగే ఎంతో బిజీగా ఉన్నప్పట్టికీ పిలవగానే ట్రైలర్ లాంచ్ కోసం ముంబై నుంచి వచ్చిన విశ్వక్ సేన్ కి థాంక్స్. విశ్వక్ సేన్ చెప్పినట్లు త్వరలోనే మా కలయికలో కొత్త సినిమా ప్రకటన వస్తుంది. అందులో విశ్వక్ సేన్ విశ్వరూపం చూస్తారు” అన్నారు.
అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ హీరోయిన్ గా ఇది నా మొదటి సినిమా అని తెలిపారు. సితార బ్యానర్ లో పనిచేయడం సంతోషంగా ఉందని, తనను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నిర్మాత వంశీ గారికి, దర్శకుడు రమేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ టీమ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
సూర్య వశిష్ఠ మాట్లాడుతూవిశ్వక్ సేన్ కి ధన్యవాదాలు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉందని, తనను నమ్మి తనకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్, వంశీకి, చినబాబు కి కృతఙ్ఞతలు చెప్పారు. అలాగే దర్శకుడు రమేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
నటి నవ్యస్వామి మాట్లాడుతూ ఈ వేడుకకు హాజరైన విశ్వక్ సేన్ గారికి ధన్యవాదాలు చెప్పారు. 2020 తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిపోయిందని, అంచనాలు పెరిగాయని, ఆ అంచనాలను అందుకొని అందరినీ అలరించే చిత్రం ఇది అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాత వంశీకి, దర్శకుడు రమేష్ కి రుణపడి ఉంటా అన్నారు.