నిమిషం పాటు అన్ని ట్రాఫిక్ కూడళ్లలో రెడ్ సిగ్నల్
ఎక్కడి వాహనాలు అక్కడే.. అదే సమయంలో
ఆగనున్న మెట్రో ప్రభుత్వ, ప్రైవేటు
కార్యాలయాల్లోనూ ‘జనగణమన’ హైదరాబాద్‌లోని
జిపిఓ సర్కిల్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నెల 8వ తేదీన వేడుకలు ప్రారంభం కాగా, ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం (నేడు) సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనున్నది. ఇందులో భాగంగా ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఆబిడ్స్ జిపిఒ సర్కిల్లో జరిగే జాతీయ గీతాలాపనలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం ఆబిడ్స్, నెక్లెస్ రోడ్డు వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సిఎస్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థ లు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు ఇలా ప్రతిచోటా ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలని కోరారు.
మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనకు వీలుగా అన్ని ప్రధాన కూడళ్లల్లో రెడ్ సిగ్నల్స్‌ను వేసి.. నిమిషం పాటు ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. జిపిఓ సర్కిల్ వద్ద జరిగే కార్యక్రమాల్లో స్వాతంత్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించాలని, రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులు పలు కళాశాలకు చెందిన విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిఎడి కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డిజిపి జితేందర్, పిఆర్ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, కలెక్టర్ అమోయ్‌కుమార్, పోలీసు కమిషనర్ సివి ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు
* సమైక్యతా స్ఫూర్తిని చాటాలి: డిజిపి
సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డిజిపి మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న (నేడు) ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడానికి పోలీసుశాఖ ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సమన్వయం చేసుకోవాలని కోరారు.
* నిమిషం పాటు మెట్రో రైళ్లు నిలిపివేత
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సందర్భంగా మంగళవారం 11:30 గంటలకు హైదరాబాద్ మెట్రో రైళ్లలను నిమిషం పాటు ఎక్కడికక్కడ నిలిపివేయనున్నారు. రైళ్లలో, మెట్రో స్టేషన్లలో గీతాలాపన చేయాలని అధికారులు కోరారు. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రయాణికులు లేచి నిలబడి పాల్గొనాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎండి ఎన్‌విఎస్ రెడ్డి కోరారు.