మహారాష్ట్రలో ఘోరం,33 మంది నిందితులపై కేసు
24 మంది అరెస్టు.. పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్లు
థాణె: మహారాష్ట్రలోని థాణె జిల్లాలో ఒక 15 సంవత్సరాల మైనర్ బాలికపై గడచిన ఎమినిమి నెలలుగా వేర్వేరు ప్రదేశాలలో అనేక సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన 33 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులలో 24 మందిని అరెస్టు చేయడంతోపాటు ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌లోని డోంబివిలిలోగల మాన్పడ పోలీసులు ఐపిసిలోని వివిధ సెక్షన్లతోపాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 29 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ మధ్య నిందితులు ఆ బాలికపై అనేక సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అదనపు పోలీసు కమిషనర్(తూర్పు రీజియన్) దత్తాత్రేయ కరాలే గురువారం విలేకరులకు తెలిపారు.
ఆ బాలిక ప్రియుడు ఈ ఏడాది జనవరిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆ ఘోరాన్ని వీడియో తీయడంతో ఇది మొదలైందని ఆయన చెప్పారు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని ఆ బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని, ఆ తర్వాత అతని స్నేహితులు, ఇతర సహచరులు వేర్వేరు ప్రదేశాలలో కనీసం నాలుగైదు సార్లు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సిపి తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఎసిపి సోనాలి ధోలే సారధ్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. బాధితురాలు 33 మంది పేర్లు చెప్పిందని, వీరిలో 24 మందిని అరెస్టు చేశామని, ఇందుకు సంబంధించి ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు. ఈ నేరంతో సంబంధం ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.