Friday, November 22, 2024

తాలిబన్ల ఏలుబడిలో అఫ్గానిస్థాన్‌లో అత్యధిక పౌరుల ఊచకోత

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : అఫ్గానిస్థాన్ తాలిబన్ల స్వాధీనం లోకి వచ్చిన తరువాత అంతకు ముందుకన్నా ప్రాణనష్టం తగ్గినప్పటికీ పౌరులపై దాడులు, హత్యలు బాగా పెరిగాయని ఐక్యరాజ్యసమితి మంగళవారం తన నివేదికలో పేర్కొంది. యుఎన్ మిషన్ ఇన్ అఫ్గానిస్థాన్ లేదా యుఎన్‌ఎఎమ్‌ఎ విడుదల చేసిన కొత్త నివేదికలో 2021 ఆగస్టు మధ్యలో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నారని, అప్పటినుంచి ఈ ఏడాది మే వరకు 3774 మంది పౌరులు చనిపోగా, వారిలో 1095 మంది హింసాత్మకంగా హత్యలకు గురయ్యారని ఆ నివేదిక వెల్లడించింది.

2020 లోనే 3035 మంది పౌరులు హత్యకు గురయ్యారని వీరితో కలిపి మొత్తం 8820 మంది పౌరులు బలైపోయారని వివరించింది. ఈ దాడుల్లో మూడొంతులు షియాతే హజారా సమాజాన్ని లక్షంగా చేసుకుని ప్రార్థనాస్థలాలు,పాఠశాలలు, మార్కెట్ల వద్ద పేలుళ్లు జరిగాయని, ఈ పేలుళ్లలో 95 మంది పౌరులు చనిపోగా, వారిలో 92 మంది మహిళలే అని, వీరు కాక . 287 మంది పిల్లలు బలైపోయారని నివేదిక పేర్కొంది. తాలిబన్లకు బద్ధవైరులైన సున్నీ ఉగ్రవాద గ్రూపుల ప్రాబల్యం ఉన్న ఖొరసాన్ ప్రావిన్స్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు నాయకత్వంలో పేలుళ్ల దాడులు ఎక్కువగా జరిగాయని తెలిపింది. పౌరుల పైన, వారి ఆస్తుల పైన జరిగే ఈ దాడులు ఖండించదగినవని, తప్పనిసరిగా నిరోధించవలసినవని యుఎన్ మిషన్ (అఫ్గానిస్థాన్) మానవ హక్కుల సర్వీస్ చీఫ్ ఫియోనా ఫ్రాజెర్ పేర్కొన్నారు.

అఫ్గాన్లు కొన్నేళ్ల నుంచీ సాయుధ పోరాట బాధితులైనప్పటికీ, గతంలో అత్యవసర వైద్యం, ఆర్థిక సాయం, మానసిక మద్దతు ఉండేదని, తాలిబన్లు ఏలుబడి లోకి వచ్చిన తరువాత ఇవన్నీ ఇప్పుడు కష్టమైపోయాయని ఆమె పేర్కొన్నారు. అఫ్గాన్ ప్రజల జీవించే హక్కును కాపాడాల్సిందిగా ఆమె తాలిబన్లకు విజ్ఞప్తి చేశారు. తక్షణం ఈ దాడులను ఆపాలని, అప్గాన్ల భద్రత తాలిబన్ ప్రభుత్వ బాధ్యతని ఆమె గుర్తు చేశారు. అయితే తాలిబన్ల స్పందన వేరేగా ఉంది. అఫ్గానిస్థాన్ పతనం అంచులో ఉన్నప్పుడు తాము కఠిన మైన నిర్ణయాలు తీసుకుని ఆ సంక్షోభం నుంచి రక్షించడానికి అధికారం చేపట్టామని తాలిబన్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News