ముర్ముకు మద్దతుగా ఓటేసిన 126 మంది విపక్ష ఎంఎల్‌ఎలు, 17మంది ఎంపిలు
చివరికి కేరళలోనూ బోణీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి అభ్యర్థిగాద్రౌపది ముర్మును ఎంపిక చేసిన రోజునుంచే ఆమె ఘన విజయం సాధిస్తారనే విషయం స్పష్టమైంది. అయితే ఊహించినదానికన్నా ఎక్కువ మెజారిటీతో ఆమె విజయం సాధించడం విశేషం. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి తమ ఓట్లు చీలిపోకుండా చూడడానికి గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ చాలా రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీలనుంచి దాదాపు 126 మంది ఎంఎల్‌ఎలు, 17 మంది ఎంపిలు ఆమెకు మద్దతుగా ఓటేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అసోంలో ఏకంగా 25 మంది విపక్ష ఎంఎల్‌ఎలు ముర్ముకు అనుకూలంగా ఓటేశారు. అసోం అసెంబ్లీలో 126 మంది సభ్యులుండగా, ఎన్‌డిఎకు 79 మంది ఎంఎల్‌ఎలున్నారు. కానీ ఆ రాష్ట్రంనుంచి ముర్ముకు 104 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ విపక్ష ఎంఎల్‌లకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇక మధ్య ప్రదేశ్‌లోనూ ముర్ముకు 16 ఓట్లు అదనంగా పోలయ్యాయి.
ఆ రాష్ట్రంలో ఆమెకు మొత్తం 146 ఓట్లు పోలయ్యాయి. బిజెపికి ఉన్న సీట్లకన్నా ఎక్కువసంఖ్యలో పార్టీ అభ్యర్థి ముర్ముకు పోలయినట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. జార్ఖండ్‌లో మొత్తం 81 మంది ఎంఎల్‌ఎలలో కేవలం 9 మంది మాత్రమే విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటేశారు. విపక్షాలకు చెందిన దాదాపు 10 మంది క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఇక మహారాష్ట్రలో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. శివసేనను చీల్చిన ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి గద్దెనెక్కిన సమయంలో జరిగిన విశ్వాస పరీక్షలో ఆయనకు164 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఆ రాష్ట్రంనుంచి ముర్ముకు181 ఓట్లు లభించడం విశేషం. అంటే విపక్షాలకు చెందిన 16 మంది ముర్ముకు ఓటేశారని అర్థం. మేఘాలయలో ఉన్న టిఎంసి ఎంఎల్‌ఎలలో కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఇక్కడ ముర్ముకు ఆరు ఓట్లు అదనంగా వచ్చాయి. మణిపూర్‌లోనూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. గుజరాత్‌నుంచి 10 మంది ప్రతినక్ష ఎంఎల్‌ఎలు, బీహార్, చత్తీస్‌గఢ్‌లలో ఆరుగురు చొప్పున, రాజస్థాన్‌లో ఐదుగురు, గోవానుంచి నలుగురు విపక్ష ఎంఎల్‌ఎలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు.అనూహ్యరీతిలో కేరళనుంచి ముర్ముకు ఒక ఓటు పోలయింది.
140 మంది సభ్యులున్న కేరళ అసెంబ్లీలో ఎన్‌డిఎకు ఒక్క ఎంఎల్‌ఎ కూడా లేరు. కానీ ఆ రాష్ట్రంనుంచి ముర్ముకు ఓటు పడడం ఆశ్చర్యం కలిగించింది. చివరికి ప్రతిపక్షాలను ఒక్క తాటిపై తేవడానికి ప్రధాన సూత్రధారి అయిన మమతా బెనర్జీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కూడా తిరుగుబాటు చోటు చేసుకోవడం గమనార్హం. నలుగురు తృణమూల్ ఎంపిలు, నలుగురు ఎంఎల్‌ఎలు ముర్ముకు మద్దతుగా ఓటేసినట్లు బిజెపి చెప్పుకొంటోది. అయితే వీటిలో నాలుగు ఓట్లు మాత్రమే చెల్లగా మిగతావి చెల్లలేదు. ఇక ఆంధ్రప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఒక్క ఓటు కూడా పడలేదు.10 గంటలపాటు జరిగిన ఓటింగ్ తర్వాత ముర్ముకు 2824 మంది , యశ్వంత్‌కు 1877 మంది ఓటేసినట్లు తేలింది. ముర్ము ఓట్ల విలువ 6,76,803 కాగా, యశ్వంత్ సిన్హా ఓట్ల విలువ 3,80,177గా ఉంది.ఈ ఎన్నికల్లో ముర్ముకు 64 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా ప్రతిపక్షాల ఐక్యత అనేది ఊహాజనితమేనని, చివరికి రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాలకు ఏది మంచిదో దాన్నే చేస్తాయి అని జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ముర్ము ఎన్నిక విషయంలో అక్షర సత్యమనిపిస్తోంది.