Thursday, January 23, 2025

మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః జిమ్‌కు వెళ్లే వారికి విక్రయించే డ్రగ్స్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు భారీ ఎత్తున పట్టుకున్నారు. డ్రగ్స్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్‌రెడ్డి తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని ధూల్‌పేటకు చెందిన నితీష్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. రాహుల్ ఇతడికి సహకరిస్తున్నాడు. నితీష్ జిమ్‌కు వచ్చే వారికి మంచి శారీరాకృతి రావాలంటే మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు తీసుకుంటే బాగుంటుందని చెప్పడంతో చాలామంది యువకులు నిందితుడి వద్ద కొనుగోలు చేస్తున్నారు.

మరో నిందితుడు రాహుల్ సాయంతో వాటిని జిమ్‌కు వెళ్లే వారికి విక్రయిస్తున్నాడు. ఈ విషయం డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు తెలియడంతో సోమవారం ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల సాయంతో వాటిని విక్రయించే ప్రాంతానికి వచ్చారు. అక్కడ నితీష్ అనుమానస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా డ్రగ్స్ ఇంజక్షన్లు లభ్యమయ్యాయి. మరో నిందితుడు రాహుల్ అప్పటికే పని ఉందని వెళ్లి పోవడంతో తప్పించుకున్నాడు. మరో కేసులో చాంద్రాయణగుట్టకు చెందిన సోహైల్ నహేది, అహ్మద్ కురేషీతో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సాయంతో డ్రగ్స్ విక్రయిస్తున్న సోహైల్‌ను అరెస్టు చేశారు.

వట్టేపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో సోహైల్ అనుమానస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అహ్మద్ కురేషీ పరారీలో ఉన్నాడు. డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్ శైలజారాణి, ఎస్సై రాములు, కానిస్టేబుళ్లు కలిసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News