టోక్యో: జపాన్ లోని టోక్యో నగరానికి సమీపంలో సముద్రతీరమైన పుకుషిమా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3 గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.36 గంటలకు భూ ప్రకంపనలు సంభవించినట్టు జపాన్ వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. టోక్యోనగరం లోనూ కొద్ది నిమిషాలపాటు భూ ప్రకంపనలు కొనసాగడంతో నగరమంతా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్టు సమాచారం. కాంటో రీజియన్‌లో 20 లక్షల ఇళ్లకు పైగా విద్యుత్ సరఫరా ఆగిపోయినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలియజేసింది. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జపాన్ ప్రధాని పుమియో కిషిడా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.