చైబస (జార్ఖండ్): జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. టొంటో, గొలికెర ఏరియాలో ఈ సంఘటన జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారని ఝార్ఖండ్ పోలీస్ అధికార ప్రతినిధి, ఐజి (ఆపరేషన్స్) అమోల్ వి హోంకార్ వెల్లడించారు.
మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉందని చెప్పారు. మృతుల్లో ఒకరు జోనల్ కమాండర్ కాగా, మరొకరు సబ్‌జోనల్ కమాండర్, ఇంకొకరు ఏరియా కమాండర్, క్యాడర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉన్నారని ఐజి పేర్కొన్నారు. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు మహిళా మావోయిస్టు కాగా, మరొకరు ఆర్గనైజేషన్ ఏరియా కమాండర్ అని తెలిపారు.
మావోయిస్టుల కోసం గాలిస్తుండగా, పొదల్లో దాగున్న వారు కాల్పులు ప్రారంభించారని, వారిని ఎదుర్కోడానికి పోలీస్‌లు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారని మరో పోలీస్ అధికారి చెప్పారు. సంఘటన స్థలం నుంచి రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ నారాయణ్ పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఒక టాస్స్‌ఫోర్స్ జవాన్ మృతి చెందిన సంఘటన తెలిసిందే.