Tuesday, January 7, 2025

ఎక్స్‌ప్లోజివ్స్ పరిశ్రమలో భారీ పేలుడు

- Advertisement -
- Advertisement -

ఒకరు మృతి, పలువురికి తీవ్ర
గాయాలు మెగ్నీషియం పెల్లెట్
తయారీలో మూడుసార్లు పేలుడు
పరుగులు తీసిన కార్మికులు..
10 కిలోమీటర్ల మేర వినిపించిన
పేలుడు శబ్దాలు

ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం,
మరికొందరికి గాయాలు మెగ్నీషియం
పెల్లెట్ తయారీలో మూడుసార్లు పేలుడు
పరుగులు తీసిన కార్మికులు..
10 కిలోమీటర్ల మేర పేలుడు శబ్దాలు
మన తెలంగాణ/యాదాద్రి/యాదగిరిగుట్ట రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, పెద్దకందుకూరు గ్రామ పరిధిలో గల ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ ప్రైవేట్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. శనివారం ఉదయం 9.35 నిమిషాల సమయంలో కంపెనీలోని పీఆర్డీసీ విభాగంలోని బ్లాక్ నెంబర్ 3లో మెగ్నీషియం పెల్లేట్ తయారీలో ప్రమాదవశాత్తు జరిగిన మూడు భారీ పేలుళ్లతో విధులు నిర్వహిస్తున్న జనగామ జిల్లా, బచ్చన్నపేటకు చెందిన కార్మికుడు మార్క కనకయ్య (54) మృతి చెందాడు. యాదగిరిగుట్ట మండలం, రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్‌కు తీవ్రగాయాలు కాగా, అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. బాంబు పేలుడుతో ప్రమాదానికి గురైన మార్క కనకయ్య, ప్రకాష్‌ను వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా, కనకయ్య అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ ప్రమాద సంఘటనలో గాయాలైన మరికొంతమంది కార్మికులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. భారీ పేలుడు శబ్ధంతో విధి నిర్వహణలో ఉన్న దాదాపు 100 మందికిపైగా కార్మికులకు చెవి, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.పీఆర్డీసీ విభాగంలోని మెగ్నీషియం పెల్లేట్ తయారీలో సంభవించిన పేలుడుకు కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి షిఫ్టులో విధులు నిర్వహిస్తున్న కార్మికులు లంచ్ సమయం కావడంతో సుమారు 15 మంది పనిచేస్తున్న పీఆర్డీసీ విభాగం బ్లాక్ నెంబర్ 3లో పేలుడు సంభవించిన సమయంలో కార్మికులు నలుగురు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఉదయం 9.35 నిమిషాల సమయంలో మూడు పెల్లేట్లలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్లు తెలిపారు. ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఒకరు చనిపోవడం, కార్మికులకు గాయాలుకావడం బాధాకరమైనప్పటికీ ఆ సమయంలో కార్మికులు బ్లాక్‌లో లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని తెలిపారు.

పేలుడుతో పరుగులు తీసిన కార్మికులు..
భారీ పేలుడుతో విధి నిర్వహణలో ఉన్న వందలాది మంది కార్మికులు వివిధ బ్లాక్‌ల నుంచి బయటకు పరుగులు తీశారు. కంపెనీలో సంభవించిన పేలుడు శబ్ధం సుమారు 10 కిలోమీటర్లలోపు అంటే పెద్దకందుకూరు, తాళ్లగూడెం, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల వరకు మూడు సార్లు పేలుడు శబ్ధాలు రావడంతో మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు,

ఫైర్ సిబ్బంది..
పేలుడు జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరు కున్నారు. ఫైర్ సిబ్బంది పేలుడు ఘటన వద్దకు చేరుకొని పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కంపెనీకి తరలివచ్చిన కార్మికుల కుటుంబాలు, ప్రజలను పోలీసులు సిబ్బంది అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ, సీఐ, పోలీసు సి బ్బంది పరిశీలన చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్‌ఎ బీర్ల అయిలయ్య పరిశీలించారు. పేలుడు ఘటనపై కంపెనీ అధికారులు, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో సేఫ్టీ మెథడ్స్ లేకుండా పనులు చేయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినా కంపెనీ యాజమాన్యం తీరులో ఎలాంటి మార్పు లేదన్నారు. అనంతరం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి, వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దకందూరు ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు ఘటన విచారకరమని ఆలేరు మాజీ ఎంఎల్‌ఎ గొంగిడి సునీతామహేందర్ అన్నారు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించి మాట్లాడుతూ.. మృతుడి కుటుంబాన్ని కంపెనీ యాజమాన్యం అన్ని విధాలుగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News