ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ పార్కింగ్ స్టాండ్‌లో మంటలు చెలరేగి 150కిపైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే ఈ ఘటనలు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫామ్ సమీపంలోని పార్కింగ్ స్టాండ్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘఠణ జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆర్‌పిఎఫ్, జిఆర్‌పికి చెందిన బృందాలు అగ్నిమాపక పసిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పినట్లు వారు తెలిపారు.
మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ 150కి పైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా తగలబడి పోయాయని వారు చెప్పారు. కాగా..ఈ ఘటన పట్ల అదనపు డిఆర్‌ఎం లాల్జీ చౌదరి విచారం వ్యక్తం చేశారు. రైల్వే ఉద్యోగుల కోసం పార్కింగ్ స్టాండ్‌ను ఏర్పాటు చేశామని, అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చౌదరి తెలిపారు. ఈ ఘటనను దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.