గుజరాత్‌లోని అతిపెద్ద వాణిజ్య పట్టణం రాజ్‌కోట్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 28కి పైగా దుర్మరణం చెందారు. మృతులలో తొమ్మిది మంది చిన్నారులు, విద్యార్థులు ఉన్నట్లు వెల్లడైంది. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుపడి చావుబతుకుల మధ్య ఉన్నట్లు తేలింది. చాలా పొద్దుపోయే వరకూ పలువురి జాడ తెలియకపోవడంతో స్థానికులలో ఆందోళన నెలకొంది. రాజ్‌కోట్‌లోని కాలావాడ్ రోడ్‌లోని నానా మావా ప్రాంతంలో ఉన్న టిఆర్‌పి గేమింగ్ జోన్‌లో మంటలు చెలరేగాయని స్థానిక పోలీసు కమిషనర్ రాజు భార్గవ్ మీడియాకు వివరించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు వెంటనే తెలియరాలేదు. ఈ ప్రాంతానికి వెంటనే భారీ సంఖ్యలో అగ్నిమాపక శకటాలను, అంబులెన్స్‌లను తరలించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. అసలేం జరిగిందనేది ఇప్పుడు చెప్పలేమని, ముందుగా ప్రాణనష్టం నివారణకు చర్యలు తీసుకోవడంపైనే దృష్టి సారించినట్లు వివరించారు. క్రమేపి మంటలు అదుపులోకి వస్తున్నాయని, ఇప్పటికైతే 20 వరకూ మృతదేహాలను వెలికితీశారని చెప్పారు.
వీటిని తదుపరి దర్యాప్తు కోసం ఆసుపత్రులకు పంపించినట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు తాను ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చే అంశంపై ఫైర్ బ్రిగేడ్ అధికారులతో మాట్లాడినట్లు వివరించారు. ఈ గేమింగ్ జోన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంటు వంటి పెద్ద కట్టడం కుప్పకూలిపోవడం, పెనుగాలులు వీస్తూ ఉండటంతో మంటలు ఓ పట్టాన అదుపులోకి రావడం లేదని అధికారులు అంగీకరించారు. ఈ పరిస్థితిపై గేమింగ్ జోన్‌కు వెళ్లిన వారి బంధువులు , స్థానికులు కలవరం చెందుతున్నారు. తాము అన్ని విధాలుగా మంటలను కంట్రోలు చేసేందుకు శక్తివంచన లేకుండా రంగంలోకి దిగినట్లు రాజ్‌కోట్‌కు చెందిన ఫైర్ ఆఫీసర్ ఖేర్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. మృతుల సంఖ్యపై పూర్తి స్థాయి నిర్థారణ తరువాత వెల్లడించాల్సి ఉంటుందన్నారు. జాడ తెలియకుండా పోయిన వారి సమాచారం లేదన్నారు. నిజానికి గేమింగ్ జోన్‌లోపలికి ఎంత మంది వెళ్లారు. మంటలలో ఎందరు చిక్కుకున్నారు? ఎందరు బయటపడ్డారు? అనేవి నిర్థారించుకుంటున్నామని అధికారి చెప్పారు. నగరంలోని అన్ని గేమింగ్ జోన్లను మూసివేయాలని వెంటనే ఆదేశించినట్లు ప్రకటించారు.
ఈ గేమింగ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకిది
పలువురికి చితి మంటలు పేర్చిన ఈ గేమింగ్ జోన్ యజమాని పేరు యువరాజ్ సోలంకి అని రికార్డుల ద్వారా వెల్లడైంది. ఈ వ్యక్తి ఆయన సంస్థపై చట్టపరమైన చర్యలకు దిగుతున్నట్లు, సంస్థ వివరాలు ఆరా తీస్తున్నట్లు ఎస్‌పి చెప్పారు. ప్రాణాంతక చర్యలకు దారితీసేలా వ్యవహరించిన నిర్లక్షం, బాధ్యతారాహిత్యం వంటి చర్యలకు కేసు పెడుతున్నట్లు వెల్లడించారు. మంటలకు కారణాలు వెంటనే తెలియచేయడం కుదరదు, ఇప్పుడు అంతా ప్రాధమిక దర్యాప్తు క్రమంలోనే ఉందన్నారు.
రంగంలోకి దిగిన సిఎం భూపేంద్ర పటేల్
మంటలను అదుపులో పెట్టడం, గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించడం ప్రాధాన్యత క్రమాలని ,ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు వెలువరించామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విలేకరులకు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగిందని, సహాయక చర్యలు చేపట్టారని వివరించారు.